ఆమరణ దీక్ష : 20 కిలోలు తగ్గిన హార్థిక్‌

Hardik Patel On Fast Demanding Patidar Reservation - Sakshi

అహ్మదాబాద్‌ : పటేళ్లకు విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో కోటా కోరుతూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన పటేల్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ నిరసన మంగళవారం పదకొండో రోజుకు చేరింది. దీక్షకు దిగినప్పుడు 78 కిలోల బరువున్న పటేల్‌ ప్రస్తుతం 20 కిలోలు తగ్గారని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపారు.  దీక్షా వేదిక వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్‌ ‘ఐసీయూ ఆన్‌ వీల్స్‌’ ను సిద్ధంగా ఉంచారు. కాగా తన నివాసాన్ని సందర్శించే ప్రజలను పోలీసులు వేధించడం నిలిపివేసే వరకూ తాను వైద్యులను అనుమతించనని మెడికల్‌ చెకప్‌కు హార్ధిక్‌ పటేల్‌ నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు.

పటేళ్లకు కోటాతో పాటు రైతు రుణాల మాఫీ వంటి పలు డిమాండ్లను పటేల్‌ ముందుకు తెచ్చారు.గత నెల 25న హార్థిక్‌ పటేల్‌ నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. మరోవైపు నిరవధిక దీక్ష చేపట్టిన హార్ధిక్‌ పటేల్‌ను పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా రానున్నారు. మోదీ సర్కార్‌పై పలు సందర్భాల్లో సిన్హా నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.

11 రోజుల నుంచి దీక్ష చేస్తుండటంతో హార్థిక్‌ పటేల్‌ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వస్తున్నా గుజరాత్‌లోని బీజేపీ సర్కార్‌ ఈ అంశంలో ఇప్పటివరకూ జోక్యం చేసుకోలేదు. కాంగ్రెస్‌ సహా విపక్షాల నుంచి హార్థిక్‌ ఆందోళనకు మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

రైతుల కోసం, గుజరాత్‌ ప్రజల కోసం నిరసనకు దిగిన హార్థిక్‌ పటేల్‌తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శక్తి సింగ్‌ గోహిల్‌ డిమాండ్‌ చేశారు. ఇక వ్యవసాయ రుణాల మాఫీ డిమాండ్‌పై హార్థిక్‌కు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్దతు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top