breaking news
Patel agitation
-
‘అలాగైతే అందరి పేర్లూ రామ్‌గా మార్చాలి’
అహ్మదాబాద్ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నగరాల పేర్లను మార్చడం పట్ల పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యోగి ఆదిత్యానాథ్ సర్కార్ అలహాబాద్, ఫైజాబాద్ నగరాల పేర్లను మార్చడాన్ని పటేల్ ప్రస్తావిస్తూ పేర్లు మార్చినంత మాత్రన సమస్యలు పరిష్కారమైతే భారతీయులందరి పేర్లను రాముడిగా మార్చాలని చురకలు వేశారు. నగరాల పేర్లను మార్చడంతో దేశం సుసంపన్నమైతే ఇక దేశంలోని 125 కోట్ల మంది భారతీయుల పేర్లను రాముడిగా మార్చాలని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి ఎన్నో అంశాలు ప్రధానంగా ముందుకొస్తుంటే ప్రభుత్వం మాత్రం పేర్లు, విగ్రహాల పట్ల ఆసక్తిగా ఉందని ఎద్దేవా చేశారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల ప్రకటించిన క్రమంలో హార్ధిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతకుముందు అలహాబాద్ పేరును ప్రయాగ రాజ్‌గా యూపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఇక ముజఫర్‌నగర్ పేరును లక్ష్మీనగర్‌గా, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌ను కర్ణావతిగా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
క్షీణించిన హార్ధిక్ ఆరోగ్యం
అహ్మదాబాద్ : పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో పటేళ్లకు రిజర్వేషన్ కోరుతూ.. హార్ధిక్ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 14 రోజుల నుంచి దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని సోలా సివిల్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. బాగా నీరసించిపోవడంతో పాటు.. కిడ్నీ సంబంధిత వ్యాధితో హార్దిక్ బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పటేళ్లకు కోటాతో పాటు రైతు రుణాల మాఫీ వంటి పలు డిమాండ్లను పటేల్ ముందుకు తెచ్చారు. గత నెల 25న నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన హార్థిక్ పటేల్‌కు.. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. -
ఆమరణ దీక్ష : 20 కిలోలు తగ్గిన హార్థిక్
అహ్మదాబాద్ : పటేళ్లకు విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో కోటా కోరుతూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ నిరసన మంగళవారం పదకొండో రోజుకు చేరింది. దీక్షకు దిగినప్పుడు 78 కిలోల బరువున్న పటేల్ ప్రస్తుతం 20 కిలోలు తగ్గారని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపారు. దీక్షా వేదిక వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్ ‘ఐసీయూ ఆన్ వీల్స్’ ను సిద్ధంగా ఉంచారు. కాగా తన నివాసాన్ని సందర్శించే ప్రజలను పోలీసులు వేధించడం నిలిపివేసే వరకూ తాను వైద్యులను అనుమతించనని మెడికల్ చెకప్‌కు హార్ధిక్ పటేల్ నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. పటేళ్లకు కోటాతో పాటు రైతు రుణాల మాఫీ వంటి పలు డిమాండ్లను పటేల్ ముందుకు తెచ్చారు.గత నెల 25న హార్థిక్ పటేల్ నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. మరోవైపు నిరవధిక దీక్ష చేపట్టిన హార్ధిక్ పటేల్‌ను పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా రానున్నారు. మోదీ సర్కార్‌పై పలు సందర్భాల్లో సిన్హా నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. 11 రోజుల నుంచి దీక్ష చేస్తుండటంతో హార్థిక్ పటేల్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వస్తున్నా గుజరాత్‌లోని బీజేపీ సర్కార్ ఈ అంశంలో ఇప్పటివరకూ జోక్యం చేసుకోలేదు. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి హార్థిక్ ఆందోళనకు మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రైతుల కోసం, గుజరాత్ ప్రజల కోసం నిరసనకు దిగిన హార్థిక్ పటేల్‌తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత శక్తి సింగ్ గోహిల్ డిమాండ్ చేశారు. ఇక వ్యవసాయ రుణాల మాఫీ డిమాండ్‌పై హార్థిక్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. -
హీరో నుంచి జీరో అయ్యాడు..
గాంధీనగర్: గుజరాత్లో హార్దిక్ పటేల్ నాయకత్వంలో ఉప్పెనలా ఉవ్వెత్తిన లేచిన పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమం నెల రోజుల్లోనే ఎందుకు నీరు కారిపోయింది. ఒక్క పిలుపుతో ఒక్కసారిగా తరలి వచ్చిన ఐదు లక్షల మంది ప్రజలు నేడు ఏమయ్యారు. హార్దిక్ పటేల్ నేడు ఎక్కడికెళ్లినా ఆయన వెనక పాతిక మంది స్వకులస్థులు కూడా ఎందుకు పోగవడం లేదు. మూడు నెలల క్రితం వరకు ఎవరికీ తెలియని 22 ఏళ్ల హార్దిక్ పటేల్ రెండు నెలల కాలంలోనే హీరో అయ్యారు. అలాంటి ఉచ్ఛస్థితి నుంచి నెల రోజుల్లోనే జీరో ఎందుకయ్యారు. హీరోగా ఆయన కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసిన సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తోంది. ఆయన్ని హీరో చేసిన అదృశ్య శక్తులే ఇప్పుడు ఆయన్ని జీరో చేశాయా ? ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు నేడు రాజకీయ పరిశీలకులకే కాకుండా సామాన్యులకు కూడా కలుగుతున్నాయి. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి తరఫున హార్దిక్ పటేల్ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 25వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగిన భారీ ర్యాలీకి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు తరలిరావడం, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం తెల్సిందే. సెప్టెంబర్ 19వ తేదీన రివర్స్ దిండి యాత్ర పేరు మార్చి ఏక్తా యాత్ర పేరిట పటేళ్లు ఎక్కువగా ఉన్న సూరత్‌లోని వరచ్చాలో నిర్వహించిన ర్యాలీకి 144వ సెక్షన్ కింద విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించి కనీసం 50 మంది కూడా హాజరు కాలేదు. అలాగే సెప్టెంబర్ 22, మంగళవారం గుజరాత్‌లోని అరవల్లి జిల్లాలో పటేల్ నిర్వహించిన సమావేశానికి కేవలం రెండు వేల మంది ప్రజలు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు రావడంతో పటేల్ అక్కడి నుంచి తప్పించుకొని తన కావల్కేడ్లో పారిపోయారు. అన్ని రహదారుల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తుండడంతో కారు లో శ్రేయస్కరం కాదని భావించిన పటేల్ ఓ సాధారణ దొంగలా పొలాల వెంట పారిపోయారు. ఆ మరుసటి రోజు పటేల్ గుజరాత్ టీవీ ఛానెల్ ముందుకొచ్చి...మఫ్టీలో ఉన్న పోలీసులు తనను నిర్బంధంలోకి తీసుకొని రాత్రంతా కారులోనే బంధించి ఉంచారని, అహ్మదాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ధ్రంగాధర వద్ద వదిలేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని పటేల్ అనుచరులు టీవీ ఛానెళ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ప్రజలు పెల్లుబికిన ఆగ్రహావేశాలతో వీధుల్లోకి వచ్చి ఆరాచకం సృష్టిస్తారు. కనీసం ఆగస్టు 25న జరిగిన సంఘటనల లాంటివి కూడా పనరావృతం కాకపోవడం గమనార్హం. అదే రోజు అర్ధరాత్రి పటేల్ కనిపంచడం లేదంటూ ఆయన అనుచరులు దాఖలు చేసిన హబియస్ కార్పస్ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా చీవాట్లు పెట్టడం పటేల్‌కు మరో ప్రతికూల పరిణామం. తనను మఫ్టీలో ఉన్న పోలీసులు నిర్బంధించారంటూ పటేల్ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఓ దొంగ లాగా పొలాల గుండా పారిపోవడాన్ని తాము గమనించామని, అందుకని సకాలంలో ఆయన్ని పట్టుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టగలిగామని గాంధీనగర్ పోలీస్ ఇనిస్పెక్టర్ జనరల్ హాస్ముక్ పటేల్ వ్యాఖ్యానించారు. పటేల్‌ను నిజంగానే నిర్బంధించారనడానికి పటేల్‌గానీ, ఆయన అనుచరులుగానీ ఇప్పటికీ ఆధారాలు చూపించలేకపోతున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 14న గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌తో హార్దిక్ పటేల్ బృందం చర్చలు జరపిన నాడే రిజర్వేషన్ల ఉద్యమం నీరుగారుతున్న విషయం అర్థమైంది. ఆ సమావేశంలో పటేళ్ల రిజర్వేషన్ల గురించి పటేల్ బృందం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆగస్టు 25న పటేళ్లపై విరుచుకుపడిన 4,200 మంది పోలీసులపై చర్య తీసుకోవాలని, హోం శాఖ సహాయ మంత్రి రజనీకాంత్ పటేల్‌ను కఠినంగా శిక్షించాలని మాత్రమే పటేల్ బృందం డిమాండ్ చేసింది. పది రోజుల్లో డిమాండ్లను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పది రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ చర్యా లేదు. పటేళ్ల నుంచి ఏ స్పందనా లేదు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్న హెచ్చరించిన ఎన్ఆర్ఐ పటేళ్లు కూడా తర్వాత తమ ప్రతిపాదనను విరమించుకున్నారు. తమ రాజకీయ అవసరాల కోసం హార్దిక్ పటేల్‌ను హీరో చేసిన అదృశ్య శక్తులే మళ్లీ ఆయన్ని జీరో చేశాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమాన్ని లేవదీసి, తద్వారా మొత్తం రిజర్వేషన్ల విధానాన్నే సమీక్షించాలన్నది అధికారంలోవున్న భారతీయ జనతాపార్టీ, దానికి మద్దతు ఇస్తున్న ఆరెస్సెస్ నేతల వ్యూహమని ఒక వర్గం విశ్లేషకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను సమీక్షించాల్సిందేనంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన డిమాండ్‌ను ఆ వర్గం ప్రస్తావిస్తోంది. మరెందుకు ఉద్యమాన్ని చల్లార్చినట్టు అని ప్రశ్నిస్తే.....ఓ పక్క బీహార్ ఎన్నికలు, మరోపక్క ఇది సరైన అదనుకాదని, తమకు అనుకూలంగా రాజకీయ పరిస్థితులు లేవని గ్రహించడం వల్లనే ఉద్యమాన్ని నడిపించిన శక్తులే, ఉద్యమాన్ని నీరుగార్చాయన్నది వారి సమాధానం. వి.నరేందర్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్