జాతీయ కేన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం: ప్రధాని | Govt to establish National Cancer Centre, says manmohan singh | Sakshi
Sakshi News home page

జాతీయ కేన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం: ప్రధాని

Dec 30 2013 9:48 PM | Updated on Sep 2 2017 2:07 AM

దేశంలో ఏటా పెరుగుతున్న కేన్సర్ కేసులపై ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ములాన్‌పూర్(పంజాబ్): దేశంలో ఏటా పెరుగుతున్న కేన్సర్ కేసులపై ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధితో పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ కేన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని, దీన్ని ప్రాంతీయ కేన్సర్ కేంద్రాలతో అనుసంధానిస్తామని తెలిపారు.  కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు అందుబాటు ధరల్లో ప్రపంచస్థాయి చికిత్స అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు తక్కువ ధరల్లో ఆరోగ్య సేవలను అందించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. చండీగఢ్ దగ్గర్లోని ములాన్‌పూర్‌లో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హోమీబాబా కేన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేసి ప్రసంగించారు.
 
 

ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఏటా 50 వేలమంది రోగులకు అత్యాధునిక చికిత్స అందుతుందని, పంజాబ్‌కే కాకుండా ఇతర ఉత్తరాది రాష్ట్రాల వారికీ ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్రం జాతీయ కేన్సర్ నియంత్రణ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 27 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో రాష్ట్రస్థాయి కేన్సర్ కేంద్రాలను స్థాపిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలో ఏటా నమోదవుతున్న మరణాల్లో 13 శాతం మరణాలకు కేన్సరే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఈ వ్యాధి కారణంగా ఏటా 9 లక్షల మంది చనిపోతున్నారని, 11 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో పంజాబ్  గవర్నర్ శివరాజ్ పాటిల్,  ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement