భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు | Governor Kesareenath alleges on Mamata | Sakshi
Sakshi News home page

భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు

Jul 6 2017 2:17 AM | Updated on Sep 5 2017 3:17 PM

భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు

భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆ రాష్ట్ర గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి బుధవారం ఆరోపించారు.

- మమతపై గవర్నర్‌ కేసరీనాథ్‌ ఆరోపణలు
ఇరువురికి రాజ్‌నాథ్‌ ఫోన్‌  
 
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆ రాష్ట్ర గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి బుధవారం ఆరోపించారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బదూరియా ప్రాంతంలో ఫేస్‌బుక్‌ పోస్ట్‌ కారణంగా చెలరేగిన మతఘర్షణల విషయంలో మమత, త్రిపాఠిల మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. గవర్నర్‌ తనను బెదిరించారనీ, అవమానించారని మమత మంగళవారం ఆరోపించారు. ఈ ఆరోపణలను గవర్నర్‌ ఖండించారు. మమత ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ‘నాపై ఆరోపణలు చేయడం మాని రాష్ట్రంలో శాంతి భద్రతలపై వారు దృష్టిపెడితే బాగుంటుంది.

రాజ్‌భవన్‌ రాష్ట్ర ప్రభుత్వ విభాగం కాదు. ప్రతి పౌరుడూ ఇక్కడకు వచ్చి తమ సమస్యను చెప్పుకోవచ్చు’ అని త్రిపాఠి అన్నారు. మమత, త్రిపాఠిల మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం వీరిరువురికి వేర్వేరుగా ఫోన్లు చేశారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. బదూరియాలో ప్రస్తుత పరిస్థితి గురించి కూడా రాజ్‌నాథ్‌ ఆరా తీశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ మాట్లాడుతూ గవర్నర్‌ రాజ్యాంగ పరమైన అన్ని పరిధులను దాటి వ్యవహరించారని అన్నారు. 
 
బదూరియాలో ఉద్రిక్తత
మత ఘర్షణలు చోటుచేసుకున్న బదూరియా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. బుధవారం ఉదయం 11 గంటల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనా నమోదు కాలేదని ఓ పోలీసు అధికారి చెప్పారు. పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు యత్నిస్తు న్నారు. చాలా దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాలు బుధవారం కూడా తెరచుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement