దద్దరిల్లిన బెంగళూరు | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన బెంగళూరు

Published Tue, Sep 12 2017 4:22 PM

దద్దరిల్లిన బెంగళూరు

సాక్షి, బెంగళూరు : సీనియర్‌  జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు నిరసనగా  ఇవాళ (మంగళవారం)  చేపట్టిన  ర్యాలీతో  బెంగుళూరు వీధులు జనసంద్రంగా మారాయి.  గౌరి హత్య విరోధి వేదిక  ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు  దేశవ్యాప్తంగా తరలి వచ్చిన  సుమారు  50వేలమంది ఆందోళనకారులతో   బెంగళూరులోని సెంట్రల్‌ కాలేజీ  గ్రౌండ్‌ దద్దలిల్లింది. అలాగే  దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు, రచయితలు, కవులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు,  విద్యార్ధులు  బెంగళూరు రైల్వేస్టేషన్‌నుంచి సెంట్రల్‌ కాలేజీవరకు ర్యాలీ  నిర్వహించారు.

ఆమ్‌ ఆద్మీనేత ఆసిష్‌  ఖేతన్‌, దళిత నేత జిగ్నేష్ మేవాని‌,  రచయిత సాయినాధ్‌లతో పాటు వామ పక్షపార్టీలకు చెందిన నాయకులు,  పలు దళిత , మహిళా సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు  సహా ఆమ్ ఆద్మీ పార్టీ  బెంగళూరు  విభాగం  ఈ నిరసన ర్యాలీలో పాల్గొంది.  అలాగే  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన  పలువురు జర్నలిస్టు నాయకులు,  వామపక్షనేతలు, జర్నలిస్టులు, విద్యార్థి, మహిళా, కార్మికనేతలు  తరలి వెళ్లారు.  ర్యాలీ అనంతరం జరిగిన సభకు  ప్రముఖ సామాజిక ఉ‍ద్యమకారులు మేథా పాట్కర్‌,   తీస్తా సెతల్వాద్‌,  ఆనంద్‌  పట్వర్ధన్‌, కవితా కృష్ణన్‌,  జిగ్నేష్‌​ మేవాని  హాజరయ్యారు.

పెన్నునే ఆయుధంగా మలిచి పోరాడారు..
ఐయామ్‌ గౌరీ లంకేశ్‌ మహా ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ ఉద్యమకారిణి మేథా పాట్కర్‌ ... దబోల్కర్‌ లాంటి నేతలను హత్య చేసిన సనాతన సంస్థ లాంటి సంఘాలు గోవాలాంటి చోట్ల ఇంకా ఉండటంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందంటే అది గౌరీలాంటి హేతువాదుల వల్లనే అని, తన పెన్నునే ఆయుధంగా మలిచి పోరాడారన్నారు.

ఛాందసవాదాన్ని తుదకంటా ఎదిరించి పోరాడిన వ్యక్తి గౌరి అని, కుల్బుర్గిని హత్య చేసిన హంతకులను సీఎం సిద్ధరామయ్య రెండేళ్లు అయినా ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోయారని ప్రశ్నించారు.  గౌరిని హత్య చేసిన హంతకులకు శిక్షపడే దాకా పోరాటం ఆగదని, న్యాయం జరిగేవరకూ అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. అంతిమ విజయం సాధించేవరకూ యుద్ధం మరింత ఉధృతంగా సాగాలని మేథా పాట్కర్‌ సూచించారు.

గౌరి ఫైర్‌ బ్రాండ్‌ రైటర్‌...
తీస్తా సెతల్వాద్‌ మాట్లాడుతూ... ‘నేను గౌరి 1960లో పుట్టాం. అయినా తన నన్ను చిన్న చెల్లి అని పిలిచేది. ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గౌరి పట్ల యావత్‌ జాతి కదిలి రావడం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువలా వస్తోంది. స్థానిక భాషలో ఆమె ఫైర్‌ బ్రాండ్‌ రైటర్‌. మేమిద్దరం చాలాచోట్లకి కలిసి ప్రయాణించాం. ఆమె హేతువాద ధోరణి కులం పట్ల ప్రశ్నించేలా చేసింది. బసవన్న తుకారాం సంప్రదాయాలను ఆమె సమర్థించింది.

లౌకిక వాదం, భిన్నత్వం ఈ దేశ అస్తిత్వాలు. ఇవి విదేశీ సంస్కృతీ కాదు. ఫాసిస్టు శక్తులు ఈ సంస్కృతిని మన నుంచి తీసుకుపోలేవు. కేవలం నిజాలు మాత్రమే మాట్లాడగల ధైర్యం కలిగిన నాయకురాలు గౌరి. ఆమె నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతోవుంది. మన వైఖరి సంకుచితంగా ఉండకూడదన్న విషయం గుర్తుంచుకోవాలి. దేశవ్యాప్తంగా అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇది. గౌరి పోరాటం ..ఆమె మరణం వృధాగా పోకూడదు.’ అని అన్నారు. కాగా ఈ నెల 6వ తేదీన...గౌరీ లంకేశ్‌ బెంగుళూరులోని తన నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement