భవిష్యత్తు భారతీయ నగరాలదే

Future belongs to the Indian cities itself - Sakshi

అభివృద్ధిలో పరిగెడుతున్న పట్టణాలు 

మొదటి, నాలుగు స్థానాల్లో సూరత్, హైదరాబాద్‌

భారతదేశ నగరాలు పరుగెడుతున్నాయి. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటి 10 భారతదేశ నగరాలేనని తాజా నివేదిక చెబుతోంది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా 2019–2035 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా అభివృద్ధి చెందే నగరాల జాబితాను విడుదల చేసింది.

అందులో మొదటి 10 భారతీయ నగరాలే. నివేదిక ప్రకారం వజ్రాల వ్యాపారానికి పేరుగాంచిన సూరత్‌ (గుజరాత్‌) 9.17% వార్షిక వృద్ధితో మొదటి స్థానంలో, 8.47% వృద్ధితో హైదరాబాద్‌ 4వ స్థానంలో, 8.16  % వృద్ధితో విజయవాడ పదో స్థానంలో నిలవనున్నాయి. మొదటి పది నగరాల్లో తమిళనాడుకు చెందిన మూడు నగరాలు మూడవ స్థానం సంపాదించుకోనున్నాయి. భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, భవిష్యత్తులో చైనాను మించిపోతుందని వస్తున్న అంచనాలకు ఈ నివేదిక బలాన్నిస్తోంది. 
చిన్నవే అయినా.. ఘనంగా! 
ప్రపంచంలోని అతిపెద్ద నగరాలతో పోలిస్తే భారతీయ నగరాలు ఆర్థికపరంగా చాలా చిన్నవే అయినా 2027 నాటికి ఆసియా దేశాల్లోని అన్ని నగరాల సగటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఉత్తర అమెరికా, ఐరోపాల్లోని అన్ని నగరాల జీడీపీని మించిపోతుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ అధిపతి రిచర్డ్‌ హాల్ట్‌ స్పష్టం చేశారు. ప్రపంచ మహానగరాల జాబితాలో ఇప్పటికీ, 2035 నాటికి తొలి స్థానాల్లో పెద్దగా మార్పులు ఉండవని అంచనా వేశారు. ప్రస్తుతం జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న న్యూయార్క్, టొక్యో, లాస్‌ ఏంజెలిస్, లండన్‌లు తమ స్థానాలను పదిలపరుచుకుంటాయని, పారిస్‌ స్థానంలో షాంఘై, చికాగో స్థానంలో బీజింగ్‌ వస్తాయన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top