
మీరేప్పుడైనా బెంగళూరు వెళ్లారా? అబ్బో చాలాసార్లు వెళ్లాం.. చాలా చూశాం అంటారా? ఎన్నిసార్లు చూసినా మారనిది ఏంటని అక్కడికి వెళ్లొచ్చిన వారిని లేదా అక్కడే ఉంటున్న వారిని అడిగితే వచ్చే సమాధానం ఒకటే. అదే ట్రాఫిక్ సమస్య. దీని కారణంగా రోజులో ఎక్కువ సమయం రోడ్లపైనే గడపాల్సి వస్తుందని బెంగళూరు నగర వాసులు తరచుగా వాపోతుంటారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. ఒక్క బెంగళూరే కాదు దేశంలోని ప్రధాన మహా నగరాలన్ని ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నాయి.
సింగపూర్ మోడల్‌తో చెక్
ఇండియా ఐటీ రాజధానిగా వెలుగొందున్న బెంగళూరు (Bengaluru) మహా నగరాన్ని చాలా కాలంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు సాఫ్ట్‌వేర్ కంపెనీ 'జోహో కార్పొరేషన్' సీఈఓ శ్రీధర్ వెంబు. బెంగళూరులో ప్రతిపాదిత భారీ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎక్స్‌లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. సింగపూర్ అమలు చేస్తున్న ప్రజా రవాణా నమూనాతో భారత నగరాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని ఆయన అంటున్నారు. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధించి, పబ్లిస్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
"ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో సింగపూర్ ఒకటి. అత్యంత నివాసయోగ్యమైన నగరంగానూ పేరొందిన సింగపూర్.. ప్రజా రవాణాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రైవేటు వాహనాలపై నియంత్రణను పక్కాగా అమలు చేస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేసే వారు కచ్చితంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎన్‌టైటిల్‌మెంట్ (COE) కలిగివుండాలి. ఈ సర్టిఫికెట్ ధర లక్ష సింగపూర్ డాలర్ల కంటే ఎక్కువ. ఇది కారు ధర కంటే అధికం. భారతీయ నగరాలు సింగపూర్ కంటే చాలా ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్నాయి. మన నగరాలను నివాసయోగ్యంగా మార్చడానికి విస్తృతమైన ప్రజా రవాణాను నిర్మించాలి. అది సాధ్యమే" అని ఎక్స్‌లో శ్రీధర్ వెంబు ((Sridhar Vembu) పోస్ట్ చేశారు. అయితే బెంగళూరులో ప్రతిపాదిత భారీ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు గురించి ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కానీ బెంగళూరు లాంటి అత్యధిక జనసంద్రత కలిగిన నగరాల్లో బలమైన, సమ్మిళిత ప్రజా రవాణా అవసరాన్ని నొక్కి చెప్పారు.
స్పందించిన ఎంపీ తేజస్వి సూర్య
శ్రీధర్ అభిప్రాయంతో బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) ఏకీభవించారు. రూ. 18,500 కోట్ల వ్యయంతో బెంగళూరులో ప్రతిపాదిత టన్నల్ రోడ్డు నిర్మాణాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల సామాన్యులకు ఒరిగేదేం లేదని, ప్రైవేట్ కార్లు కలిగి ఉన్న టాప్ 10% నివాసితులకు మాత్రమే ప్రయోజనం ఉంటుందని విమర్శించారు. దీనికి బదులుగా బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), మెట్రో రైళ్ల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ సూర్య సూచించారు. 'బెంగళూరులో 2031 నాటికి 16,580 BMTC బస్సులు అవసరం. కానీ మన దగ్గర కేవలం 6,800 మాత్రమే ఉన్నాయి. 2031 నాటికి 317 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైళ్లు నడవాలి. ప్రస్తుతం 78 కి.మీ. వరకే మెట్రో సేవలు పరిమితమయ్యాయ'ని తెలిపారు. 20కి పైగా నిలిచిపోయిన ఫ్లైఓవర్లతో పాటు నగరంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
చదవండి: కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!
నెటిజన్ల రియాక్షన్
ప్రభుత్వ రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని శ్రీధర్ వెంబు వెలిబుచ్చిన అభిప్రాయంపై ఎక్స్‌లో నెటిజనులు స్పందించారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే.. ప్రజలు సహజంగానే ప్రైవేట్ వాహనాలకు దూరంగా ఉంటారని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మౌలిక సదుపాయాలంటే విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్ల మాత్రమే కాదని.. సంపన్నుల నుంచి సామాన్యూల వరకు ప్రయాణించేలా ప్రపంచ స్థాయి ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని మరొకరు సూచించారు.
నివాస ప్రాంతాల నుంచి వాణిజ్య సముదాయాలకు ప్రజా రవాణాను అనుసంధానిస్తూ నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మరో నెటిజన్ అన్నారు. బెంగళూరు వంటి మహా నగరాల్లో కొత్తగా మౌలిక సదుపాయాలను కల్పించడం సులభమా, లేదా ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగైనదిగా అప్‌గ్రేడ్ (Upgrade) చేయడం సులభమా? అన్నది.. చూడాలని మరొకరు సూచించారు.
I want to add that Singapore, one of the most advanced economies in the world and one of the most livable cities, relies extensively on public transport. Singapore also limits the number of private cars through the mechanism of open market trading of Certificate of Entitlement… https://t.co/ob7WjOiybJ
— Sridhar Vembu (@svembu) July 15, 2025