విదేశీయుల నోట్ల మన దేశం గొప్పదనం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. అద్భుతమైన సంస్కృతి అని.. పండుగలు, ఆహారపానీయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూంటే విని గర్వంగా ఫీల్ అవుతూంటాము కూడా. కానీ.. మహిళల భద్రతకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి మన గర్వం కాస్తా పటాపంచలవుతుంది.
విదేశీ టూరిస్టులను మరీ ముఖ్యంగా మహిళలను వెకిలిచేష్టలతో ఇబ్బంది పెట్టే పోకిరిలు, సెల్ఫీల కోసం బలవంత పెట్టేవారు.. పిల్లికూతలతో వేధించే ఆకతాయిలు.. లైంగికదాడులకు పాల్పడే దుర్మార్గులు చాలామందే కనిపిస్తారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ సోలో ట్రావెలర్ ఎమ్మా కూడా ఇదే చెబుతోంది. భారతదేశం అద్భుతమైన దేశమే కానీ.. మహిళల భద్రత విషయంలో ఒక్కో నగరం తీరు ఒక్కోలా ఉందని తేల్చేసింది. అంతేకాకుండా.. దేశం మొత్తమ్మీద పలు నగరాల్లో పర్యటించిన తరువాత ఒక్కో నగరానికి ర్యాకింగ్ కూడా ఇచ్చింది.
@discoverwithemma_ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌తో ఈ ర్యాంకింగ్స్‌ను పోస్ట్ చేసింది. ‘‘గొప్పలు చెప్పడం లేదు.. నిజాయితీగా నా అనుభవాలు ఇవి’ అన్న శీర్షికతో చేసిన ఆ పోస్ట్ ఇప్పటికే వైరల్‌గా మారింది. ఎమ్మా నిజాయితీని మెచ్చుకున్న వారు కొందరు... సహజంగానే విమర్శించిన వారు మరెందరో! ఇంతకీ ఎమ్మా తన పోస్టులో ఏ నగరానికి ఏ ర్యాంక్ ఇచ్చిందంటే...
దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ మహిళల భద్రత విషయంలో ఎమ్మాకు బాగా నచ్చేసిన రాష్ట్రం కేరళ. పదికి పది మార్కులేసేసింది. ప్రశాంతంగా ఉంటుందని, ఇతరుల పట్ల గౌరవం కనపరుస్తారని, విదేశీయులను మనస్ఫూర్తిగా స్వాగతించే లక్షణం కేరళీయులదని కొనియాడింది. కేరళ తరువాత ఎనిమిది మార్కులతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రెండోస్థానంలో నిలిచింది. ఈ నగరంలో భద్రతకు ఏం ఢోకాలేదన్న భావనతో గడిపానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన సీన్లు ఈ నగరం సొంతమని, హడావుడి, పరుగులు లేనేలేవంది. దక్షిణాదిలోని గోవా విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడ సరదాగానే గడిచింది కానీ.. రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో తిరగాలంటే బెరుకుగా అనిపించిందని స్పష్టం చేసింది. ఈ కారణంగా గోవాకు ఎమ్మా వేసిన మార్కులు ఏడు. రాజస్థాన్‌లోని పుష్కర్, జైపూర్‌లు ఎమ్మా జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. పుష్కర్ ఆధ్యాత్మిక శోభతో అలరారితే.. కొన్ని సంఘటనలు చాలా అసౌకర్యమూ కలిగించాయని తెలిపింది.
A female foreigner, discoverwithemma, who travelled to India, rated popular Indian cities on the basis of safety:
Delhi : -1/10
Agra : 3/10
Jaipur : 5/10
Pushkar : 6/10
Udaipur: 8/10
Mumbai : 6.5/10
Goa : 8/10
Kerala : 9/10 pic.twitter.com/FwVSsjKE9e— Mini Nair (@minicnair) October 24, 2025
నిర్మాణశైలి విషయంలో జైపూర్ ఒక అద్భుతమైనప్పటికీ స్థానికులు కొంచెం తొందరపాటు మనుషులని తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భద్రతకు సంబంధించి మంచి, చెడూ రెండూ కనిపించాయని తెలిపింది. ఈ నగరం చాలా బిజీ.. గందరగోళాలతో కూడిందని తెలిపింది. ప్రపంచ అద్భుతం తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా తనను మైమరిపించిన మాట వాస్తవమైనప్పటికీ.. అక్కడ శబ్ధ కాలుష్యం చాలా ఎక్కువని, అలాగే విదేశీయులను దోచుకునే స్కాములకూ లెక్కలేదని వివరించింది. ఆఖరుగా... ఎమ్మా దృష్టిలో ఈ దేశం మొత్తమ్మీద అధ్వాన్నమైన నగరం... మన రాజధాని ఢిల్లీ నగరం! ఒంటరి మహిళ పర్యాటకులు ఈ నగరానికి రాకపోవడమే మంచిదని సూచిస్తోంది ఎమ్మా.
ఇకనైనా మేలుకోండి..
ఎమ్మా ర్యాంకింగ్స్‌పై సోషల్ మీడియాలో బోలెడన్ని ప్రతిక్రియలు వ్యక్తమయ్యాయి. నిక్కచ్చిగా, నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు చాలామంది ఎమ్మాను మెచ్చుకున్నారు. వివిధ రాష్ట్రాల టూరిజమ్ బోర్డులు కూడా ఎమ్మా ర్యాంకింగ్‌లపై స్పందించాయి. పరిస్థితులను మెరుగు పరిచేందుకు పనిచేస్తామని హామీ ఇచ్చాయి. మరికొందరు భద్రత అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని, వ్యక్తుల ప్రవర్తనను బట్టి కూడా మారుతూంటుందని విమర్శించిన వారూ లేకపోలేదు. ప్రియా శర్మ అనే పర్యాటకురాలు మాట్లాడుతూ విదేశీ పర్యాటకుల అభిప్రాయాలకు, అనుభవాలకు విలువ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, పర్యాటక రంగం వృద్ధి చెందాలంటే ఎమ్మా పోస్టును ఒక మేలు కొలుపుగా తీసుకోవాలని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎమ్మా పోస్టు తరువాత పర్యాటక భద్రతకు సంబంధించిన అప్లికేషన్లు, మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన హాస్టళ్లు, ఒంటరి మహిళ పర్యాటకులకు గైడెడ్ టూర్లు వంటి అంశాలపై ఇంటర్నెట్‌లో వెతకడం ఎక్కువ కావడం!.


