ట్విట్టర్‌లో ‘మీటూ అర్బన్‌ నక్సల్‌’ ట్రెండింగ్‌

Filmmaker Vivek Agnihotri wanted to make a list of #UrbanNaxals - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల కార్యకర్తలను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేయడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వీరిపై అర్బన్‌ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్‌ నక్సల్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పలువురు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీంతో ట్విట్టర్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌గా మారింది. తొలుత బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి స్పందిస్తూ..‘అర్బన్‌ నక్సల్స్‌కు మద్దతు ఇస్తున్నవారి జాబితా రూపొందించేందుకు చురుకైన యువతీయువకులు కొందరు నాకు కావాలి.  సాయం చేయాలనుకున్నవారు నాకు సందేశం పంపండి’ అని ట్వీట్‌ చేశారు. దీంతో జర్నలిస్టులు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు సహా చాలామంది అగ్నిహోత్రిపై మండిపడ్డారు. హక్కుల కార్యకర్తలకు తమ మద్దతును తెలియజేసేందుకు వేలాది మంది ‘మీటూ అర్బన్‌ నక్సల్‌’ హ్యాగ్‌ట్యాగ్‌ను ట్వీట్‌ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 55,000 మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్‌ చేశారు.   

128 సంస్థలకు మావోలతో సంబంధాలు!
మావోలతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలతో 2012లో యూపీఏ ప్రభుత్వం జాబితా రూపొందించిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో కొందరు ఆ సంస్థల సభ్యులు ఉన్నారన్నారు. మావోలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో పౌరహక్కుల కార్యకర్తలను అరెస్ట్‌చేయడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు యూపీఏ నాటి జాబితాను తెర మీదికి తెచ్చారు. ‘మావోయిస్టులతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలను 2012లోనే యూపీఏ ప్రభుత్వం గుర్తించింది. వాటి కోసం పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనాడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. జాబితాలో ఉన్న సంస్థల కోసం పనిచేస్తున్న వారిలో వరవరరావు, సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, అరుణ్‌ ఫెరీరా, వెర్నన్‌ గొన్‌సాల్వెజ్, మహేశ్‌ రౌత్‌లు కూడా ఉన్నారు’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top