క్షేత్రస్థాయిలో కశ్మీర్‌ ఎలా ఉందో తెలుసుకుంటాం!

European Union Parliament Members Travel in Kashmir - Sakshi

శ్రీనగర్‌: ఐరోపా సమాఖ్యకు చెందిన 27 మంది పార్లమెంట్​సభ్యుల బృందం మంగళవారం కశ్మీర్‌లో పర్యటిస్తోంది. గట్టి భద్రత మధ్య ఢిల్లీ నుంచి ప్రత్యేక వాహనంలో ఈ బృందం శ్రీనగర్‌కు చేరుకుంది. కశీర్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై  ఐరోపా ఎంపీల బృందం అధ్యయనం చేపట్టనుంది. స్థానికులతోపాటు దాల్‌ లేక్‌లో పడవ నడిపేవారితోనూ మాట్లాడి వాస్తవిక పరిస్థితులను తెలుసుకోనుంది. ‘విదేశీ ప్రతినిధుల బృందంగా మేం కశ్మీర్‌లో పర్యటిస్తుండటం మంచి అవకాశంగా భావిస్తున్నాం. అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేరుగా తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది’ అని యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు సభ్యుడు నాథన్‌ గిల్‌ మంగళవారం ఏఎన్‌ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం  రద్దు చేసిన అనంతరం విదేశీ ప్రతినిధులు కశ్మీర్‌లో పర్యటించటం ఇదే తొలిసారి. ఇది పూర్తిగా అనధికారిక పర్యటన అని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.  అంతకుముందు భారత్‌లో పర్యటిస్తున్న ఈయూ ఎంపీలు.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​తో భేటీ అయ్యారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top