
మళ్లీ బరిలోకి ఎలక్షన్ కింగ్.. 177వసారి
మరోసారి ఎలక్షన్ కింగ్ పోటీ చేసేందుకు బరిలోకి దిగాడు. ఉప ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు. అతడు ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం ఇది 177వ సారి.
మధురై: మరోసారి ఎలక్షన్ కింగ్ పోటీ చేసేందుకు బరిలోకి దిగాడు. ఉప ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు. అతడు ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం ఇది 177వ సారి. ఇంతకీ ఎవరు ఆ ఎలక్షన్ కింగ్ అని అనుకుంటున్నారా..! తమిళనాడులో సేలంలో కే పద్మరాజన్(57) అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన 1988 నుంచి పలు ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. ఆయనను అంతా ఎలక్షన్ కింగ్ అంటారు.
తాజాగా తిరుపరన్కుంద్రం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో అక్కడ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మరోసారి నామినేషన్ పత్రాలు సమర్పించి ఔరా అనిపించారు. అదే సమయంలో ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా నామినేషన్లు వేశారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్ఎం సీనివేల్ గత మే నెలలో గెలిచాడు. అయితే, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టకముందే అదే నెల 25న చనిపోయాడు. దీంతో అక్కడ ఖాళీ ఏర్పడగా ఉప ఎన్నిక ఖరారైంది.