చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ

ED Questions Chidamabaram Over Money Laundering Allegation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఆగస్ట్‌ 7 వరకూ పటియాలా హౌస్‌కోర్టు చిదంబరానికి మధ్యంతర ఊరట ఇవ్వగా, తాజాగా ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.గతంలో ఆయన ముందస్తు బెయిల్‌ దరఖాస్తును వ్యతిరేకిస్తూ జులై 10న ఈడీ బదులిచ్చింది. చిదంబరానికి ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే వాస్తవాలు వెలుగుచూడటం సాధ్యం కాదని ఈడీ స్పష్టం చేసింది.

మరోవైపు ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ సహా 18 మంది నిందితులపై జులై 19న సీబీఐ ఢిల్లీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. మనీల్యాండరింగ్‌ కేసులో మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంల ముందస్తు బెయిల్‌ అప్పీల్‌ను పటియాలా హౌస్‌ కోర్టు విచారిస్తోంది.

2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో మాక్సిస్‌ అనుబంధ సంస్థ గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ సర్వీసెస్‌ కంపెనీకి 800 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.3,680 కోట్ల) మేర విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతులు జారీచేశారు. కానీ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులు రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి అనుమతుల్ని ఎలా జారీ చేయగలిగారన్న విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top