సీబీఎస్‌ఈ: టాప్‌లో బస్‌ డ్రైవర్‌ కొడుకు

DTC Driver Son Prince Kumar Tops CBSE Class 12 Results In Science Stream - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పట్టుదలగా ప్రయత్నిస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని మరోసారి రుజువైంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌లో పనిచేస్తున్న బస్‌ డ్రైవర్‌ కొడుకు శనివారం విడుదలైన సీబీఎస్‌ఈ ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఖరీదైన, ‘హైటెక్‌’  ప్రైవేటు విద్యాలయాల్లో చదివితేనే ర్యాంకులు వస్తాయనే అపోహను పటాపంచలు చేశాడు. శనివారం విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీకి చెందిన ప్రిన్స్‌ కుమార్‌ 500 మార్కులకు 485 సాధించి సైన్స్‌ విభాగంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్‌గా నిలిచాడు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ట్విటర్‌లో స్పందిస్తూ.. కుమార్‌ ప్రభుత్వ విద్యాలయాల పట్ల నమ్మకాన్ని పెంచాడని అభినందించారు. ద్వారకా ప్రాంతంలోని సెక్టార్‌ 10లో గల రాజ్‌కియా ప్రతిభా వికాస్‌ విద్యాలయలో విద్యనభ్యసిస్తున్న కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ప్రభుత్వం విద్యా పునర్‌వైభవానికి చర్యలు తీసుకుంటోందని చెప్పాడు. ‘మా పాఠశాలలో సౌకర్యాలు చాలా బాగున్నాయి. నా విజయంలో నిపుణులైన మా ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పిల్లలు ఎక్కువగా చేరుతుంటారు. మా వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఫలితాలు బాగుంటాయ’ని కుమార్‌ తెలిపాడు. తమ పాఠశాలలో పనిచేసే మాస్టార్లు ప్రైవేటు బడుల్లో పనిచేసే వారికంటే ఉన్నత విద్యావంతులని కుమార్ వెల్లడించాడు. ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్‌లో ఇంజనీరింగ్‌ చేస్తానని కుమార్‌ తెలిపాడు.

హ్యూమనిటీస్‌ విభాగంలో 95.6 శాతం మార్కులతో చిత్రా కౌశిక్‌ మొదటి స్థానంలో నిలవగా, కామర్స్‌ విభాగంలో 96.2 శాతం మార్కులతో ప్రాచి ప్రకాశ్‌ టాపర్‌గా నిలిచారు. విద్యా శాఖను పర్యవేక్షిస్తున్న సిసోడియా వారిని ట్విటర్‌లో అభినందించారు. మంచి ఫలితాలతో ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. 168 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని సిసోడియా ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది 82.02 శాతంగా ఉన్న  ఉత్తీర్ణత ఈ యేడు 83.01 శాతానికి పెరిగింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top