
లక్నో : అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు త్వరలో రానున్న నేపథ్యంలో బీజేపీ నేత గజరాజ్ రానా ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దంతెరాస్, దీపావళి పండుగలకు బంగారం, వెండి పాత్రలకు బదులు దేశంలోని హిందువులంతా ఇనుముతో చేసిన కత్తులు కొనాలని ఆయన సూచించారు. కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందంటూనే, తీర్పు ఎలాంటిదైనా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తీవ్ర మార్పులొస్తాయని, ముందు జాగ్రత్తగా ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు అవసరమని గజరాజ్ అభిప్రాయపడ్డారు.
హిందూ పురాణాల్లో దేవుళ్లు, దేవతలు కూడా తగిన సందర్భాల్లో అనువైన ఆయుధాలు ధరించి ధర్మరక్షణకు పాటుపడ్డారని, ఆకోవలోనే తన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి తప్ప వేరే అభిప్రాయాలను ఆపాదించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలపై యూపీ బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ స్పందించారు. గజరాజ్ రానా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, దాంతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ సభ్యులు వివిధ విషయాలపై చట్టానికి లోబడి స్పందించేలా మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. కాగా, రానా గతంలోనూ ... ముస్లింల పవిత్ర ప్రదేశమైన మక్కాలో శివలింగం ఉందని, ఒకప్పుడు హిందువులు అక్కడ నివాసముండేవారంటూ వ్యాఖ్యలు చేశారు.