ప్రాణం తీసిన డేటింగ్‌ ఆప్‌ | Delhi Police Solved The Kidnapping, Murder Of A DU Student | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన డేటింగ్‌ ఆప్‌

Mar 30 2018 11:11 AM | Updated on Aug 21 2018 6:02 PM

Delhi Police Solved The Kidnapping, Murder Of A DU Student - Sakshi

న్యూ ఢిల్లీ : ఈ నెల 22న కిడ్నాప్‌కు గురయిన ఢిల్లీ విద్యార్థి ఆరు రోజుల తర్వాత బుధవారం నాడు శవమై కనిపించాడు. ఈ కిడ్నాప్‌-మర్డర్‌ కేసును పరిష్కరించినట్లు, ఈ కేసులో 25 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ పోలీసు జాయింట్‌ కమిషనర్‌ అజయ్‌ చౌదరి కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మృతి చెందిన 21 సంవత్సరాల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆయుష్‌ నౌథియాల్‌కు  డేటింగ్‌ ఆప్‌ ద్వారా సాంప్లింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఇష్తాక్‌ అలీతో పరిచయం ఏర్పడింది. విద్యార్థి మరణించడానికి 10 రోజుల ముందు అతడిని కలిసాడు. ఈ సంఘటన జరిగిన రోజు అనగా మార్చి 22 మధ్యాహ్నం ఇద్దరు కలిసి భోజనం చేయడానికి ద్వారకా సెక్టార్‌ 13వద్ద కలుసుకున్నారు. అదే రోజు రాత్రి వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరిగింది. కోపంతో విద్యార్థిని ఇష్రత్‌ సుత్తితో కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ద్వారకా సెక్టార్‌ 13వద్ద ఉన్న డ్రైనేజీలో పడేశాడు. తర్వాత ఆయుష్‌ నౌథియాల్‌ తండ్రికి వాట్సాప్‌ ద్వారా ఫోన్‌ చేసి మీ కుమారున్ని కిడ్నాప్‌ చేశానని, రూ.50 లక్షలు ఇస్తే వదిలిపెడతానని బెదిరించాడు. ఆయుష్‌ నౌథియాల్‌ కాళ్లు, చేతులు కుర్చికి కట్టివేసి ఉన్న ఫోటోను కూడా పంపించాడు.

తన కుమారుడు కాలేజీ నుంచి సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో అతని తండ్రి మార్చి 22నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక తనకు వచ్చిన వాట్సాప్‌ కాల్‌ గురించి, 50 లక్షలు డిమాండ్‌ చేసిన విషయం గురించి కూడా పోలీసులకు చెప్పాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆయుష్‌ నౌథియాల్‌ గురించి చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా అతన్ని మెక్‌డొనాల్డ్స్‌ వద్ద చూసినట్లు చెప్పారు. దాంతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా దానిలో ఆయుష్‌ నౌథియాల్‌తో పాటు ఇష్తాక్‌ కూడా ఉన్నాడు. ఇష్తాక్‌ను పట్టుకోవడానికి పోలీసులు ఆయుష్‌ నౌథియాల తండ్రితో డబ్బులు ఇస్తామని అతడికి ఫోన్‌ చేయించి ఉత్తమ్‌నగర్‌ రమ్మని చెప్పారు. కానీ అతడు రాలేదు. తర్వాత నుంచి అతడి ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయింది.

చివరకు గురువారం నాడు పోలీసులు ఇష్తాక్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నేరస్తుడు హత్య కేసును కిడ్నాప్‌ కేసుగా చిత్రించి పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. కిడ్నాపర్‌కు ఇవ్వడానికి 10 లక్షల రూపాయలను సిద్ధం చేసి పెట్టుకోవాల్సిందిగా పోలీసులు తమకు సూచించారని ఆయుష్‌ నౌథియాల కుటుంబ సభ్యులు ఒక న్యూస్‌ పేపర్‌తో చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆయుష్‌ నౌథియాల్‌ చనిపోయాడన్న విమర్శలు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement