లాక్‌డౌన్: పంజాబ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Coronavirus: Punjab Extends Lockdown Till May 1 - Sakshi

చండీగఢ్‌: క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవాలంటే లాక్‌డౌన్‌ను మించిన మార్గం లేద‌ని పంజాబ్ ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను మే 1 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర కేబినెట్ ఏక‌గ్రీవ తీర్మానం చేసింది. అయితే ప్ర‌స్తుతం పంట చేతిక‌చ్చే స‌మ‌యం కాబ‌ట్టి ర‌బీ రైతులకు పంట కోత‌కు అనుమ‌తిస్తామ‌ని తెలిపింది. శుక్ర‌వారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ మంత్రుల‌తో లాక్‌డౌన్ కొన‌సాగింపుపై స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. వైర‌స్ వ్యాప్తి గురించి నిపుణులు అంచ‌నాలు భ‌యంక‌రంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. (మాస్క్ ధరించకుంటే రూ. 200 ఫైన్)

పీజీఐఎమ్ఈఆర్ అధ్య‌య‌నం ప్ర‌కారం ఇప్పుడు క‌రోనా వైర‌స్‌ను నివారించ‌లేక‌పోతే.. సెప్టెంబ‌ర్ నాటికి దేశంలో 58 శాతం జ‌నాభా దీని బారిన పడుతుంద‌ని, అంటే రాష్ట్రంలోని సుమారు 87 శాతం మందికి ఇది సోకుతుందని పేర్కొన్నారు. క‌నుక ఇప్పుడే దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డిందని అమ‌రీంద‌ర్ సింగ్ తెలిపారు. ప్ర‌భుత్వ సంచ‌ల‌న నిర్ణ‌యంతో దేశంలో లాక్‌డౌన్ పొడిగించిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. దీనిక‌న్నా ముందు ఒడిశా ప్ర‌భుత్వం ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించిన విష‌యం తెలిసిందే. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం ఇదే బాటలో నడిచే అవకాశం లేక‌పోలేదు. కాగా పంజాబ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 132 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా ఇందులో 11 మంది మృతి చెందారు. (లాక్‌డౌన్‌: ఒడిశా కీలక నిర్ణయం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top