
న్యూఢిల్లీ : కరోనాతో బాధపడుతున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో.. వైద్యులు ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వైద్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాగా, తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో జూన్ 15న సత్యేంద్ర జైన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనుకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. అయితే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయనను పూర్తిస్థాయి పర్యవేక్షణలో ఉంచారు. సత్యేంద్ర జైన్‌ఆస్పత్రిలో చేరడంతో.. ఆరోగ్య శాఖతోపాటు ఆయన నిర్వహించే అన్ని శాఖల బాధ్యతలను తాత్కాలికంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అప్పగించారు. మరోవైపు ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.