సీబీఐ కార్యాలయాల ఎదుట కాం‍గ్రెస్‌ నిరసనలు

Congress Protests Outside Cbi Offices Across The Country - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట శుక్రవారం ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగన రాహుల్‌ గాంధీ సహా విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట జరిగిన నిరసనల్లో పార్టీ రాష్ట్ర చీఫ్‌లు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.
 

మోదీ సర్కార్‌ సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చి దర్యాప్తు ఏజెన్సీని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మ తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు సీబీఐ, సీవీసీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అలోక్‌ వర్మ, రాకేష్‌ ఆస్ధానాలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను రెండు వారాల్లోగా పూర్తిచేయాలని ఆదేశించింది. సీబీఐ నూతన చీఫ్‌ ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరాదని, కేవలం పరిపాలనా వ్యవహారాలనే పర్యవేక్షించాలని కోర్టు స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top