అదృష్టం కలిసొచ్చి.. | Sakshi
Sakshi News home page

అదృష్టం కలిసొచ్చి..

Published Thu, Aug 10 2017 1:29 AM

అదృష్టం కలిసొచ్చి.. - Sakshi

అర్ధరాత్రి అటు గుజరాత్‌లోనూ, ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ హైడ్రామా.. ఎత్తులకు పైఎత్తులతో సాగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దిగ్గజం అహ్మద్‌ పటేల్‌ గెలుస్తారా? లేదా? అన్న ఉత్కంఠ. చివరికి ఇద్దరు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ఈసీ ప్రకటించడంతో 44 ఓట్లతో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు! దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ ఎన్నికల్లో పటేల్‌ తన బలంతో గెలిచారని అనేకంటే బీజేపీ మూడో అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్‌ రెబల్స్‌ పొరపాటు వల్లే గట్టెక్కారని అనడం సబబుగా ఉంటుందేమో. తమ బ్యాలట్‌ పత్రాలను బహిరంగంగా ప్రదర్శించడం వారి పొరపాటు. ఈ ఎన్నికల్లో పటేల్‌ వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి.

తమ క్యాంపులోని 44 మందికి తోడు ఇద్దరు ఎన్సీపీ, ఒక జేడీయూ ఎమ్మెల్యే మద్దతుతో తమ బలం 47కు చేరుతుందన్నది ఆయన అంచనా. కానీ చివరికి దక్కింది 44 ఓట్లే. రెబల్స్‌ ఎమ్మెల్యేల ఓట్లూ చెల్లి ఉంటే కోటా ఓటు(తొలి ప్రాధాన్య ఓట్లతో గెలవడానికి కావలసిన ఓట్ల సంఖ్య) 45గా ఉండేది. అదే జరిగి ఉంటే పటేల్‌కు 44 ఓట్లే వచ్చాయి కాబట్టి రెండో ప్రాధాన్య ఓట్ల ఆధారంగా విజేతను తేల్చే పరిస్థితి వచ్చేది. పటేల్‌ విజయావకాశాలూ తగ్గేవి. 
 
సత్తా చూపలేకపోతున్న కాంగ్రెస్‌..
ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.19 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. పైగా రాష్ట్రంలో బీజేపీకి పటిష్ట నాయకత్వమూ లేదు. మోదీ హవా, అమిత్‌ షా వ్యూహరచనపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటీదార్లు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో విపక్ష కాంగ్రెస్‌ సమరోత్సాహంతో ఉండాలి. మిగతా పార్టీల నేతలనూ తనవైపు ఆకర్షించగలగాలి. రాజ్యసభకు పటేల్‌ ఎన్నిక నల్లేరు మీద నడక కావాలి. కానీ వాస్తవం మరోలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేక ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. 
 
కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ను రాజ్యసభ ఎన్నికల్లో ఓడించి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పార్టీ శ్రేణులను నీరుగార్చాలని బీజేపీ వ్యూహం పన్నింది. జాతీయస్థాయి కీలకనేత ఓడిపోతే కాంగ్రె స్‌ డీలాపడుతుందని భావించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపు ఆకర్షించింది. వ్యూహం ఫలించడంతో ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం శంకర్‌సిన్హ్‌ వాఘేలా సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మూడో అభ్యర్థి బల్వంత్‌íసిన్హ్‌ రాజ్‌పుత్‌కు ఓటేశారు.

ఈ ఎన్నికలకు ముందే ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌ ఆలస్యంగా మేలుకుని గత నెలాఖర్లో మిగిలిన 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌కు తరలించింది. సోమవారం తిరిగి గుజరాత్‌కు తీసుకొచ్చి, ఓటేసేదాకా శిబిరంలోనే ఉంచింది. అయినప్పటికీ వీరిలో ఒకరు(కరమ్‌సింహ్‌ మక్వానా) బీజేపీకి ఓటేశారు! ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలే చెప్పారు. పటేల్‌తో సహా కాంగ్రెస్‌ నేతలెవరూ దీన్ని పసిగట్టలేకపోయారు. పటేల్‌కు 43 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓట్లు, మరొకటి ఇతర పార్టీ నుంచి పడింది. ఎన్సీపీ ఎమ్మెల్యే ఒకరు, జేడీయూ ఎమ్మెల్యే ఒకరు తాము పటేల్‌కు ఓటేశామని బాహాటంగా చెప్పారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరు పటేల్‌కు వేయలేదని పటేల్‌ దక్కిన 44 ఓట్లు తేటతెల్లం చేస్తున్నాయి.

వీరిద్దరూ పటేల్‌కు ఓసేసి ఉంటే 45 ఓట్లు దక్కేవి. ఈ ఇద్దరిలో ఎవరు పటేల్‌కు ఓటేశారన్నది మిస్టరీగా మారింది. ఈ మొత్తం తతంగంలో కాం గ్రెస్‌ మంగళవారం సాయంత్రం చూపిన కార్యదక్షత ఆ పార్టీ పరువు కాపాడింది. రెబల్‌ ఓట్లు చెల్లవంటూ చిదంబరం సహా పలువురు నేతలు ఈసీని కలసి గట్టి వాదనలు వినిపిం చారు. ఏదేమైనా పటేల్‌ది ‘సాంకేతిక’ విజయం మాత్రమేనని, సంబరాలు జరుపుకోవాల్సినంత ఘన విజయం కాదని నిపుణులు అంటున్నారు.

Advertisement
Advertisement