బెంగళూరులో ఐటీ దాడుల కలకలం

Congress, JDS sit on dharna against IT raids on ministers - Sakshi

సీఆర్‌పీఎఫ్‌ భద్రతతో రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు

లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న దేవెగౌడ మనవళ్ల సన్నిహితులే లక్ష్యం!

సాక్షి, బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల ముంగిట కర్ణాటకలో రాజకీయ ప్రముఖుల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు కలకలం రేపాయి. స్థానిక పోలీసులకు బదులు సీఆర్‌పీఎఫ్‌ బలగాల సాయంతో ఐటీ అధికారులు గురువారం బెంగళూరులో కొందరు మంత్రులు, వారి సన్నిహితుల ఇళ్లల్లో సోదాలుచేశారు. రాష్ట్ర నీటిపారుదల మంత్రి పుట్టరాజు, ఆయన మేనల్లుడి నివాసాలతో పాటు ప్రజా పనుల మంత్రి హెచ్‌డీ రేవణ్ణ సన్నిహితులు నారాయణ రెడ్డి, అశ్వత్‌ గౌడ, రాయ గౌడ ఇళ్లల్లో సోదాలుచేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రేవణ్ణ కొడుకు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ హసన్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మండ్యా లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న నిఖిల్‌(సీఎం కొడుకు) ప్రచార బాధ్యతల్ని పుట్టరాజుకు అప్పగించారు. సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్, మేనల్లుడు ప్రజ్వల్‌ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వేళ వారి సన్నిహితులపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయ ప్రేరేపితం: కుమారస్వామి
ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపునకు దిగుతున్నారని సీఎం కుమారస్వామి అన్నారు. ఐటీ విభాగాన్ని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తోందో రాజకీయ ప్రేరేపితమైన ఈ సోదాల ద్వారా తెలుస్తోందని అన్నారు. కర్ణాటక–గోవా ప్రాంతీయ ఐటీ చీఫ్‌ కమిషనర్‌ బీఆర్‌ గోపాలక్రిష్ణన్‌ పదవీ విరమణ తరువాత గవర్నర్‌ పోస్ట్‌పై కన్నేశారని, అందుకే బీజేపీకి రాజకీయ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డబ్బు ఖర్చు చేయకుండా రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప ఈ ఎన్నికల్లో గెలవగలరా? అని సవాలు విసిరారు. బెదిరింపు రాజకీయాలు ఎన్నికల్లో గెలిపిస్తాయని బీజేపీ నాయకులు భావిస్తే వారి అభిప్రాయం తప్పేనని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కాగా, ఈ ఆరోపణల్ని యడ్యూరప్ప ఖండిస్తూ...ఐటీ విభాగం తన విధులు నిర్విర్తించిందని, ఈ దాడులను రాజకీయాలతో ముడిపెట్టొద్దని అన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top