‘ఉన్నావ్‌’ అత్యాచార బాధితురాలి లేఖ: సీజేఐ స్పందన

CJI Ranjan Gogoi On Unnao Victim Letter Asks Why Her Letter Never Reached Him - Sakshi

న్యూఢిల్లీ : ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి లేఖ తనకు చేరడంలో జాప్యం కావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబం తనకి రాసిన లేఖ గురించి మీడియాలో ప్రచారం అయిన తర్వాతే తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయం మంగళవారమే తన దృష్టికి వచ్చిందన్నారు. ట్రక్కు ప్రమాదానికి ముందే..తనకు ప్రాణహాని ఉందంటూ ఉన్నావ్‌ బాధితురాలు సీజేఐకి రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సీజేఐ రంజన్‌ గొగోయ్‌ బుధవారం మాట్లాడుతూ.. జూలై 12న హిందీలో బాధితురాలు రాసిన ఈ లేఖ..తన దృష్టికి రాలేదని తెలిపారు. తాను ఇంతవరకు లేఖను చదవలేదన్నారు. ఈ విషయం గురించి కోర్టు రిజిస్ట్రీని వివరణ కోరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే బాధితులు నేరుగా కోర్టును ఆశ్రయించే స్నేహ పూరిత వాతావరణం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఉన్నావ్‌ బాధితురాలి లేఖపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది.

కాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌పై కేసు నమోదైంది. మరో పదిమంది పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఇక గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు బాధితురాలి తండ్రినే అరెస్టు చేసి హింసించడంతో ఆయన పోలీస్‌ కస్టడీలోనే మరణించారు. బాధితురాలు కూడా ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినా అతను బెయిలుపై బయటకొచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. తాజాగా బాధితురాలు, ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్‌ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోపించాయి. ట్రక్కు డ్రైవర్‌తోపాటు యజమానిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయంపై కూడా విచారణ జరుపుతామన్నారు. కాగా కుల్దీప్‌ సింగార్‌ను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు యూపీ బీజేపీ అధ్యక్షుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top