రాకేష్‌ ఆస్థానాపై మైకేల్‌ సంచలన వ్యాఖ్యలు

Christian Michel Says Rakesh Asthana Warned Him - Sakshi

న్యూఢిల్లీ : సీబీఐ మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానా తనను బెదిరింపులకు గురిచేశారంటూ క్రిస్టియన్‌ మైకేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి మైకేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్‌ ఆస్థానా గత మేలో దుబాయ్‌లో తనతో మాట్లాడారంటూ మైకేల్‌ మంగళవారం కోర్టుకు తెలిపాడు. భారత్‌కు తిరిగి వస్తే తన జీవితం నరకం అవుతుందని రాకేష్‌ తనను హెచ్చరించాడని అతడు పేర్కొన్నాడు. ఇక వైట్‌ కాలర్‌ నేరగాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తనను హంతకులు, ఉగ్రవాదుల బ్లాకులో ఉంచడం సరైంది కాదని మైకేల్‌ కోర్టుకు విన్నవించినట్లు సమాచారం. ఈ క్రమంలో మైకేల్‌ ఉన్న బ్లాక్‌లో అటువంటి వ్యక్తులెవరూ లేరని తీహార్‌ జైలు అధికారులు స్పష్టం చేశారు.

కాగా భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్‌ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానాలపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. రాకేష్‌ ఆస్థానాను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేయగా.. తనను ఫైర్‌ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్తాపం చెందిన ఆలోక్‌ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

ఇంతకీ మైకేల్ ఎవరు‌?
బ్రిటన్‌ పౌరుడైన మైకేల్‌ వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాడు. భారత్‌ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్‌ పని. మైకేల్‌ తండ్రి వోల్ఫ్‌గంగ్‌ మైకేల్‌ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశాడు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్‌ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగాడు.

ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్‌ అధికారులకు భారీగా లంచాలిచ్చాడు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్‌ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగాడు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్‌ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్‌ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997-2013 మధ్యకాలంలో మైకేల్‌ 300 సార్లు ఇండియాకు వచ్చాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top