కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్‌

Charge Sheet On Student Leader Kanhaiya Kumar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పై ఛార్జ్‌షీట్‌ నమోదైంది. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 1200 పేజీలతో కూడిన అభియోగ పత్రాన్ని సోమవారం దాఖలు చేశారు. కన్నయ్య కుమార్‌తో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉమర్‌ ఖలీద్‌, అనీర్బన్‌ బట్టాచార్య పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ వెల్లడించారు.

దేశద్రోహం(124ఎ), క్రిమినల్‌ కుట్ర(120బీ), అలర్లకు ప్రేరేపణ(147), అనుమతి లేకుండా సమావేశం కావడం(143) వంటి సెక్షన్ల ద్వారా వారిపై అభియోగాలు నయోదు చేశారు. పాటియాల హౌస్‌ కోర్టు దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. పార్లమెంట్‌పై దాడి ఘటనలో సూత్రధారి అప్జల్‌ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ 2016 ఫిబ్రవరి 9న కన్నయ్యతో పలువురు విద్యార్థి నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.

అరెస్ట్‌యిన వారికి మద్దతుగా జేఎన్‌యూ సహా, దేశ రాజధానిలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై కన్నయ్య కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై మోదీ ప్రభుత్వం కక్ష్యసారింపుగా అభియోగాలు నమోదు చేసిందని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాగా ఘటన జరిగిన మూడేళ్ల తరువాత అభియోగాలు దాఖలు చేయడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top