అజిత్‌ దోవల్‌పై ఆరోపణలు తోసిపుచ్చిన కేంద్రం​

Centre Refutes Rahul Gandhis  Claims Of Ajit Dovals Role In JeM Chief Masood Azhars Release - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను 1999లో భారత్‌ విడుదల చేయడంలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పాత్ర గురించి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన నేపథ్యంలో మసూద్‌ అజర్‌ను అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో అజిత్‌ దోవల్‌కు ఎలాంటి ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

1999లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో సీనియర్‌ అధికారిగా ఉన్న అజిత్‌ దోవల్‌.. మసూద్‌ అజర్‌ విడుదలపై సంప్రదింపులు జరిపేందుకు కాందహార్‌కు వెళ్లిన నలుగురు సభ్యులతో కూడిన కమిటీలో ఒకరు. అజర్‌ విడుదలను దోవల్‌ అప్పట్లో వ్యతిరేకించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కాందహార్‌లో విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల వెంట అజిత్‌ దోవల్‌ ఉన్న ఫోటోలను కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

పుల్వామా ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్‌ ఈ దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయాయని, వారిని హత్య చేసిన మసూద్‌ అజర్‌ను ఎవరు విడుదల చేశారో వారి కుటుంబాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మసూద్‌ అజర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను పాకిస్తాన్‌కు అప్పగించేందుకు కాందహార్‌లో అజిత్‌ దోవల్‌ నెరిపిన ఒప్పందం గురించి కూడా వారికి చెప్పాలని రాహుల్‌ నిలదీశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top