ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరూఖ్ షేక్ (65) హఠాన్మరణం చెందారు.
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరూఖ్ షేక్ (65) హఠాన్మరణం చెందారు. దుబాయ్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన తీవ్రగుండెపోటుతో కుప్పకూలిపోయారని కుటుంబసభ్యుడొకరు పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున 3.30 గంటలకు షేక్ మరణవార్త ముంబైలోని కుటుంబసభ్యులకు చేరింది. దుబాయ్‌లో అధికారిక లాంఛనాలు పూర్తయ్యిన తర్వాత షేక్ పార్థివదేహాన్ని ముంబైకి తీసుకొస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. షేక్ మరణ వార్తతో బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఒక అద్భుతమైన నటుడిని, మంచి స్నేహితుడిని కోల్పోయామని బాలీవుడ్ ప్రముఖులంతా ప్రగాఢ సంతాపం ప్రకటించారు. షేక్‌కు భార్య రూపా జైన్, కుమార్తెలు షిస్తా, సనా ఉన్నారు.