ఆమెను స్త్రీ అనాలో, పురుషుడిగా భావించాలో? | BJP MLA Controversial Comments On Mayawati Case Filed Against Her | Sakshi
Sakshi News home page

Jan 21 2019 3:58 PM | Updated on Jan 21 2019 4:17 PM

BJP MLA Controversial Comments On Mayawati Case Filed Against Her - Sakshi

‘ట్రాన్స్‌జెండర్ల కంటే కూడా మాయావతి అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు’

లక్నో : బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌కు.. మరో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ అండగా నిలిచారు. ‘1995 నాటి గెస్ట్‌హౌజ్‌ ఘటన తర్వాత కూడా మాయావతి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారంటే ఆమెకు ఆత్మగౌరవం లేనట్టే కదా. సాధనా సింగ్‌ అన్న మాటల్లో తప్పేం ఉంది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీఎస్పీ- ఎస్పీ పొత్తు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

బీఎస్పీ- ఎస్పీ పొత్తుపై మొఘల్‌సరాయ్‌ ఎమ్మెల్యే సాధనా సింగ్‌ శనివారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘అధికారం చేపట్టాలనే ఆశతో యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తనను అవమానించిన వారితో చేతులు కలిపారు. ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు. స్త్రీ గౌరవానికి కళంకం అంటించారు. ఆమెను స్త్రీ అనాలో లేదా పురుషుడిగా భావించాలో.. ఈ ఇద్దరితో కాకుండా వేరెవరితో పోల్చాలో అర్థం కావడం లేదు. ట్రాన్స్‌జెండర్ల కంటే కూడా ఆమె అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని సాధనా సింగ్‌ ప్రకటన విడుదల చేశారు. ఇక బీజేపీ నేతల తీరును తప్పుబట్టిన బీఎస్పీ నాయకుడు ఎస్సీ మిశ్రా.. ‘ బీఎస్పీ-ఎస్పీ పొత్తుతో బీజేపీ నేతలకు పిచ్చి పట్టింది. వారి పడవ మునిగిపోతుందనే బాధలో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు’  అని విమర్శించారు. సాధనా సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే కూడా సాధనా సింగ్‌ వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం గౌరవప్రదం కాదని హితవు పలికారు.

1995 నాటి ఘటన
1993లో బీజేపీని నిలువరించేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 167 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. ఈ క్రమంలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 1995లో ఓ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ నేత మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో బీజేపీ నేత ఒకరు ఆమెను కాపాడారు. అనంతర పరిణామాలతో బీజేపీతో చేతులు కలిపి బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎస్పీతో మాయావతి సంబంధాలు తెంచుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ ఎస్పీకి మాయావతి స్నేహ హస్తం అందించారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement