డిగ్రీ లేని స్మృతికి హెచ్‌ఆర్‌డీ శాఖా?

డిగ్రీ లేని స్మృతికి హెచ్‌ఆర్‌డీ శాఖా?


* ఆమెకు కీలకశాఖ అప్పగింతపై కాంగ్రెస్ ధ్వజం  

* సోనియా గాంధీ విద్యార్హత ఏంటి: ఉమా భారతి


 

 న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కనీసం డిగ్రీ కూడా లేని స్మృతికి కీలకమైన  ఈ శాఖను ఎలా కట్టబెడతారని కాంగ్రెస్ ప్రశ్నించగా.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఏ విద్యార్హతతో యూపీఏ సర్కారును నడిపించారని బీజేపీ ఎదురు ప్రశ్నించింది. ‘మోడీ కేబినెట్‌ను చూడండి. స్మృతి గ్రాడ్యుయేట్ కూడా కాదు.

 

  ఆమె ఎన్నికల అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది’ అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మంగళవారం ట్విట్టర్‌లో రాశారు. దీనిపై బుధవారం కేంద్ర మంత్రి ఉమా భారతి మండిపడ్డారు. కాంగ్రెస్ మొదట సోనియా ఏం చదివారో, ఎక్కడ చదివారో సర్టిఫికెట్లు చూపి, తర్వాతే స్మృతి గురించి మాట్లాడాలని అన్నారు. ఆరోగ్య మంత్రికి డాక్టర్ పట్టా అక్కర్లేదని, వ్యక్తుల పనితీరు చూడాలి తప్ప పట్టాలు కాదని అన్నారు. విద్యకు కీలకమైన ఈ మంత్రిత్వ శాఖను స్మృతికి ఎలా కేటాయిస్తారంటూ మానవ హక్కుల కార్యకర్త మధు కిష్వార్ ట్విట్టర్‌లో ప్రశ్నించి ఈ వివాదాన్ని లేవనెత్తారు.

 

 స్మృతి అఫిడవిట్‌లో తేడాలు..

 స్మృతి లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లలో తేడాలు ఉండడంతో బీజేపీ ఇరుకున పడనుంది. ఆమె 2004లో చాందినీ చౌక్ నుంచి పోటీ చేసినపుడు దూరవిద్య ద్వారా ఢిల్లీ వర్సిటీ నుంచి 1996లో బీఏ చేశానని తెలిపారు. 2014లో అమేథీ నుంచి పోటీ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం 1994లో ఢిల్లీ వర్సిటీ నుంచి దూరవిద్యలో బీకాం పార్ట్-1 చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో అభ్యర్థులు తప్పుడు సమాచారమిస్తే వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్మృతి విద్యార్హత వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top