రాఫెల్‌ డీల్‌ వ్యాఖ్యలు: సీనియర్‌ ఎంపీ రాజీనామా

Bihar MP Tariq Anwar Resigns NCP Over Sharad Pawar Support To Modi On Rafale Deal - Sakshi

పట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్‌లో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ తారీఖ్‌ అన్వర్‌ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో తమ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ వైఖరి నచ్చకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రాఫెల్‌ ఒప్పందం గురించి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు లేవంటూ శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు.

స్పష్టంగా అర్థమవుతోంది కదా!
‘రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరగినట్లు స్పష్టంగా కన్పిస్తోంది కదా. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఈ ఒప్పందం విషయంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ శరద్‌ పవార్‌ మాత్రమే మోదీకి అనుకూలంగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను’ అని అన్వర్‌ వ్యాఖ్యానించారు. తదుపరి ఏ పార్టీలో చేరాలన్న విషయంపై తన అనునాయులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానన్నారు. దీంతో రాఫెల్‌ ఒప్పందం విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తరుణంలో.. మోదీకి అనుకూలంగా మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భారీ మూల్యమే చెల్లించుకున్నట్లయింది.

ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యుడిగా
విదేశీ మహిళ(సోనియా గాంధీ)ను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీని వీడి శరద్‌ పవార్‌ ఎన్సీపీని స్థాపించిన సమయంలో అన్వర్‌ ఆయనకు అండగా నిలిచారు. వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. తొమ్మిది పర్యాయాలు(లోక్‌సభ- ఐదుసార్లు, రాజ్యసభ- రెండుసార్లు) ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కతియార్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అన్వర్‌ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. శరద్‌ పవార్‌తో విభేదించిన నేపథ్యంలో.. అన్వర్‌ తిరిగి సొంత గూటికి(కాంగ్రెస్‌) చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top