కొనసాగుతున్న భారత్‌ బంద్‌.. విజయవాడలో ఉద్రిక్తత

Bharat Bandh Protest Updates In Andhra Pradesh And Telangana - Sakshi

నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 ప్రధాన కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌లో దాదాపు 25 కోట్ల మంది దాకా పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి.

విజయవాడ: విజయవాడలో బంద్‌ కొనసాగుతోంది. బస్టాండ్‌ ఎదుట జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్‌ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్‌ చేపట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఎన్‌ఆర్‌సీ, సీఏఏ ,అలాగే కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని కేంద్రంలోని బీజేపీకి కాలం చెల్లిందాని ఆందోళన కారులు నిరసన తెలియజేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో వామపక్ష నేతలతో పాటు కార్మిక సంఘాలు కదంతొక్కాయి. ఉదయం 6 గంటల నుంచి కార్మికులంతా సమ్మెలో పాల్గొని నిరసనలు తెలిపారు. కేంద్రం.. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కర్నూలు: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్‌ బంద్‌కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. బంద్‌ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో విద్యాలయాలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. బస్టాండ్‌ వద్ద వామపక్ష పార్టీ నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీఎస్ఎన్‌ఎల్‌, రైల్వేస్‌, పోస్ట్‌ ఆఫీస్‌ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే  వామపక్ష నేతలు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్నారు.

మంచిర్యాల/ భద్రాద్రి/ పెద్దపల్లి: మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో సింగరేణి కార్మికులు రోడ్డెక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెకు దిగారు. నిరసన చేపట్టిన కార్మిక నాయకులు గనుల్లోకి వచ్చేందుకు ప్రత్నించడంతో పోలీసులువారి అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, కార్మిక నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top