‘గుండు కొట్టి దేశం నుంచి తరిమికొడితే 11 వేలు’

Bareilly Leader Controversial Comment On Triple Talaq Crusaders - Sakshi

బరేలీ ఎన్‌జీవో వివాదాస్పద ప్రకటన

లక్నో: ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిదాఖాన్‌, ఫర్హాత్‌ నఖ్వీ లకు గుండు కొట్టి, దేశం దాటేలా తరిమి కొట్టే వారికి బరేలీ ముస్లిం ఎన్‌జీవో చీఫ్‌ మొయిన్‌ సిద్దిఖీ నూరీ నజరానా ప్రకటించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ ఇద్దరు మహిళలకు బుద్ధి చెప్పిన వారికి అక్షరాల 11, 786 రూపాయలు ముట్టజెప్పుతానని ఆలిండియా ఫైజాన్‌-ఎ-మదీన కౌన్సిల్‌ తరపున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, నిదా ఖాన్‌, ఫర్హాత్‌ నఖ్వీలను ఇస్లాం నుంచి బహిష్కరిస్తున్నట్టు నాలుగు రోజుల కిందట బరేలీ ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే.

అసలు విషయం.. నిఖా హలాల (మొదటి భర్తను మళ్లీ పొందాలంటే కొన్నాళ్లపాటు మరొకరితో కలిసి ఉండడం) కారణంగా చిత్రవధ అనుభవిస్తున్న సబీనాకు నిదాఖాన్‌ అండగా నిలిచారు. ఫర్హాత్‌ నఖ్వీతో కలిసి ట్రిపుల్‌ తలాక్‌, నిఖా హలాలకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేపట్టారు. దాంతో ఈ ఇద్దరిపై ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేశారు. తాజాగా, బరేలీలోని ముస్లిం ఎన్‌జీవో సైతం వారిని తరిమి కొట్టిన వారికి నగదు బహుమతి ప్రకటించడంతో దుమారం రేగుతోంది.

మరోవైపు బరేలీలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఎమెల్యే రాజేష్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలో  ఫర్హాత్‌, నిదాలు శనివారం కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఫర్హాత్‌ నఖ్వీ కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సోదరి కావడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top