బెంగాల్‌ మంత్రికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్‌

Bangladesh Denies Visa to West Bengal Minister - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ గ్రంథాలయ శాఖ మంత్రి, జమాత్‌ ఉలేమా హింద్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్‌ అల్లాహ్‌ చౌదరికి బంగ్లాదేశ్‌ వీసా నిరాకరించింది. వీసా నిరాకరణకు గల కారణం వెల్లడికాలేదు. ఈ విషయంపై సిద్ధిక్‌ చౌదరి మాట్లాడుతూ.. ‘డిసెంబర్‌ 26 నుంచి 31ల మధ్య ఐదు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటనకు ఈ నెల 12వ తారీఖున వీసా కోసం దరఖాస్తు చేశాను. అక్కడ ఓ సదస్సులో పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది. నాకూ కొన్ని వ్యక్తిగత పనులున్నాయి. వీసా ఇస్తున్నట్టుగానీ, తిర​స్కరిస్తున్నట్టు గానీ నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. వీసా కోసం అన్ని పత్రాలను సమర్పించాను. అవసరమైన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తీసుకున్నాను. అయినా వీసా రాకపోవడంతో ఇప్పటికే బుక్‌చేసుకున్న టికెట్‌ను క్యాన్సిల్‌ చేసేశా’నని వెల్లడించారు.

ఈ విషయంపై బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ను వివరణ కోరగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ కార్యాలయ సిబ్బంది కూడా అందుబాటులోకి లేకుండా పోయారు. ఈ విషయంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. వీసా రాకపోవడంపై మేము నిజంగా ఆశ్చర్యపోతున్నాం. ఒక మంత్రికి బంగ్లాదేశ్‌ వీసా నిరాకరించడంపై మేము షాక్‌కు గురయ్యామని వ్యాఖ్యానించారు. సిద్ధిక్‌ చౌదరి పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల నాయకులలో ఒకరు. కాగా, సిద్ధిక్‌ చౌదరి ఇటీవల వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, దేశవ్యాప్త ఎన్నార్సీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top