మరో కేప్‌టౌన్‌ కానున్న సిలికాన్‌ సిటీ

Bangalore Will Faces Same Water Crisis As CapeTown Faced - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నీరే జీవకోటికి ప్రాణాధారం. జలం లేకపోతే జీవమే ఉండదు. ఇతర గ్రహాలు మనుషుల ఆవాసానికి అనుకూలమా, కాదా అనే విషయం కూడా అక్కడి నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే ఈ సృష్టే అంతరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా చేజేతులా భూతాపాన్ని పెంచి తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాము. అందుకే అతివృష్టి, అనావృష్టిలాంటి పరిస్థితులు. ఇంకా వేసవి పూర్తిగా ప్రారంభమవలేదు. అయినప్పటికీ అప్పుడే నీటి ఎద్దడి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ సమస్య తీవ్రంగా ఉండి ఇప్పుడు సిలికాన్‌ సిటీ బెంగళూరును బెంబేలెత్తిస్తోంది.

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) పత్రిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న10 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిలో బెంగళూరు ఒకటి. అనతి కాలంలోనే బెంగళూరు మరో కేప్‌ టౌన్‌ కానుంది. వరుస కరువు, ముందుచూపులేని ప్రభుత్వం తీరుతో కేప్‌టౌన్‌ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. గత జూన్‌-.జూలైలో అక్కడ  'డే జీరో' (ట్యాప్‌లలో నీరు రాకుండా పూర్తిగా నిలిచిపోవడం) పరిస్థితి. ప్రస్తుతం అక్కడ నీటిని కూడా రేషన్‌లో తీసుకోవాల్సిన దుస్థితి. మరికొన్ని రోజుల్లో బెంగళూరులోను ఇవే దృశ్యాలు కనిపించనున్నట్లు సీఎస్‌ఈ వెల్లడించింది.

ఈ పత్రిక వెల్లడించిన అంశాల ప్రకారం ప్రణాళిక ప్రకారం లేని నగరీకరణ, నిర్మాణాల వల్ల 79శాతం నీటి వనరులు తగ్గిపోయాయి. 1973 నుంచి నిర్మాణాలకు సంబంధించిన స్థల విస్తీర్ణం 8 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. బెంగుళూరులో ఇంతకుముందు నీటి లభ్యత 10-12 మీటర్ల లోతు లోపు ఉండేది, కానీ ప్రస్తుతం ఇది 76-91 మీటర్లకు పడిపోయింది. 30 ఏళ్ల క్రితం 5 వేల వరకూ ఉన్న బావుల సంఖ్య ప్రస్తుతం 0.45 మిలియన్లకు పెరిగింది. బెంగుళూరు జనాభా ప్రతి సంవత్సరం 3.5శాతం పెరుగుతూ 2031 నాటికి 20.3మిలియన్లకు చేరుకుంటుంది. నూతన ఆవిష్కరణలు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న నీటి వనరులను సవ్యంగా వినియోగించుకోకపోతే కేప్‌టౌన్‌లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఈ పది నగరాలు ఇప్పటికైనా మేల్కోనకపోతే అతి త్వరలోనే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ఈ పత్రిక వెల్లడించింది. బెంగుళూరుతోపాటు చైనాలోని బీజింగ్‌, మెక్సికోలోని మెక్సికో సిటీ, కెన్యాలోని నైరోబీ, పాకిస్తాన్‌లోని కరాచీ, ఆఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌, టర్కీలోని ఇస్తాంబుల్‌లో కూడా ఇవే పరిస్ధితులు నెలకొని ఉన్నాయి.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top