ఛీ.. జీవితం! ఏంది భయ్యా ఇది..

Bangalore Techie Fed Up With Traffic And Takes Horse Ride - Sakshi

బెంగళూరు: ‘‘ఉద్యోగవేటలో భాగంగా ఎనిమిదేళ్ల కిందట సిటీకి వచ్చాను. మంచి ఉద్యోగమైతే దొరికిందిగానీ, జీవితం నానాటికీ నరకప్రాయంగా తయారైంది. అందుకు మొదటి కారణం ట్రాఫిక్‌ ఇబ్బందులైతే, రెండోది సాఫ్ట్‌వేర్‌ రంగంలో సాగుతోన్న శ్రమదోపిడి. చాలా విసుగెత్తిపోయా. ఏందీ జీవితం? అనిపించేది. అందుకే నిరసనగా గుర్రం మీద ఆఫీసుకొచ్చా. లైఫ్‌లో ఇంకెప్పుడూ మల్టీనేషన్‌ కంపెనీలో పనిచేయను...’’ అంటోన్న ఈ టెకీ.. తన  వెరైటీ నిరసనతో సోషల్‌ మీడియా నయా సంచలనంగా మారాడు.

పేరు రూపేశ్‌ కుమార్‌ వర్మ. బెంగళూరులో ఓ పేరుమోసిన కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ట్రాఫిక్‌ రద్దీని నిరసిస్తూ ఇలా గుర్రం మీద ఆఫీసుకొచ్చాడు. మరి సంస్థ ఊరుకుందా? గుర్రానికి పార్కింగ్‌ ప్లేస్‌ కల్పించిందా? అని అడగొద్దు! లాస్ట్‌ వర్కింగ్‌ డే కాబట్టి మనోడిలా వెరైటీ చర్యకుదిగాడు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు నానాటికీ పెరిగిపోతున్నాయని, పరాష్కార మార్గాలను వెదకడంలో వెనుకబడ్డామని ఆవేదన చెందుతోన్న రూపేశ్‌.. తానీ పనిచేసింది సెన్సెషన్‌ కోసం కాదని, అయినాసరే పాపులర్‌ అయిపోవడంతో థ్రిల్‌ అయ్యానని చెప్పాడు. అతి త్వరలోనే సొంత కంపెనీని ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. తద్వారా దేశంలో నెలకొన్ని సమస్యలు కొన్నింటికైనా పరిష్కారాలు చూపగలననే దీమా వ్యక్తంచేశాడు. ఆటోడ్రైవర్లు, ట్రక్కుడ్రైవర్లకు సైతం యూనియన్లు ఉండగా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మాత్రం సంఘటితం కాకపోవడం శోచనీయమని, ఎంఎన్‌సీల్లో పనిచేసే భారత టెకీలు.. లైక్‌మైండెడ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి స్టార్టప్స్‌ ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా ఉద్యోగం చివరిరోజు అశ్వంపై వచ్చిన రూపేశ్‌ సొంతకంపెనీ పెట్టి పేరు సాధించకముందే సెలబ్రిటీ అయిపోయాడు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top