అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.
గువహటి: అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. గత నెలలో బీజేపీలోకి చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రణబ్ కుమార్ గొగోయ్ అనర్హులుగా ప్రకటించారు.
అనర్హతకు గురైన ఎమ్మెల్యేలలో బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా (జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్ (బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా (రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా (సిపాఝర్), జయంత మల్లా బారువా (నల్‌బారి) ఉన్నారు. గత నెలలో వీరు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. 126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్కు 69 ఎమ్మెల్యేలున్నారు. మేజిక్ సంఖ్య 63 కంటే మరో ఆరుగురు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఎలాంటి లోటు లేదు.