అర్వింద్‌ ఎందుకు రాజీనామా చేశారు?

Arvind Subramanian Stepping Down, Says Reasons Personal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్‌ సుబ్రమణియన్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. అందులో అంతగా నిజం లేదని, అమెరికా అకాడమీ పదవి వదిలి వచ్చి మళ్లీ అక్కడికే వెళ్లడం సూచిస్తోంది. ఈ ప్రభుత్వం నుంచి ముఖ్యమైన సలహాదారు పదవి నుంచి తప్పుకున్న మొదటి వ్యక్తి కూడా అర్వింద్‌ కాకపోవడం ఈ విషయాన్ని మరింత ధ్రువీకరిస్తోంది.

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ 2016లో తప్పుకున్నారు. ఆయన తనకు రెండో పర్యాయం పదవీకాలాన్ని పొడిగించని కారణంగా పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక విధాన నిర్ణాయక మండలిగా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్‌’ చైర్మన్‌ పదవికి అర్వింద్‌ పణగారియా రాజీనామా చేశారు. ఇప్పుడు అర్వింద్‌ సుబ్రమణియన్‌ రాజీనామా చేయడం కూడా చర్చ నీయాంశం అయింది. కీలక ఆర్థిక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎందుకు రాజీనామా చేస్తున్నారు. పాలకపక్ష బీజేపీకే కాకుండా ఆరెస్సెస్‌ లాంటి అనుబంధ హిందూత్వ శక్తులకు కూడా విధేయులుగా ఉన్న వారే పదవుల్లో మనుగడ సాగించగలరని, లేకపోతే తప్పుకోవడం తప్పనిసరి అవుతుందని అర్థం అవుతోంది. సమాజంలో హిందువులు, ముస్లింలు అంటూ విభజన తీసుకరావడం దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందంటూ 2016లో అర్వింద్‌ సుబ్రమణియన్‌ చేసిన వ్యాఖ్యలు ఆరెస్సెస్‌కు రుచించలేదు. గోవధ నిషేధంపై తాను ఆనాడే తన అభిప్రాయాలను వెళ్లడించినట్లయితే ఆనాడే తన ఉద్యోగం పోయేదని సుబ్రమణియన్‌ ఇటీవలనే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల కారణంగానే ఆయన తన పదవిని కోల్పోయి ఉండవచ్చు!

సుబ్రమణియన్‌తోపాటు ర ఘురామ్‌ రాజన్‌ అభిప్రాయాలు జాతి వ్యతిరేకమైనవని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి బహిరంగంగా విమర్శించడం కూడా ఇక్కడ గమనార్హమే. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి, రాత్రి వేళల్లో మహిళలు పనిచేయడానికి వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి నీతి అయోగ్‌లో పనగారియా చేసిన ప్రతిపాదనలకు కూడా ఆరెస్సెస్‌ తీవ్రంగా విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని రఘురామ్‌ రంజన్‌ పదవికి రాజీనామా చేసిన అనంతరం బహిరంగంగానే తప్పుపట్టారు. ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలనే ప్రశ్నించే ధైర్యమున్న సుబ్రమణియన్‌ లాంటి అధికారులు నానాటికి దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి ఎంతో అవసరం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దేశ ఆర్థిక విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అయితే అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఫలించినప్పుడు ఇప్పుడు తీసుకుంటున్న సంస్కరణలు ఎందుకు ఫలించడం లేవన్నది మరో ప్రశ్న. ప్రభుత్వ విధానాలకు విధేయులు కాదంటూ ముఖ్య ఆర్థిక సలహాదారులను తీసేస్తూ పోతుంటే ఫలితాల ప్రశ్న అలాగే ఉండి పోతుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top