
దశాబ్దకాలంగా బీజేపీలో అప్రతిహత నిర్ణయాలు తీసుకున్న మోదీ - షా ద్వయం ఈ సారి మాత్రం ఆర్ఎస్ఎస్ ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. 2024 ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించకపోవడంతో కమలదళంపై ఆర్ఎస్ఎస్ తిరిగి పట్టు బిగించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ సహకారం లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉంటుందనే విషయాన్ని గమనించిన మోదీ-షా ద్వయం ఆర్ఎస్ఎస్‌తో సంప్రదింపులు, ఆమోదం తర్వాతే పార్టీ నియామాకాలకు ముందుకువెళుతున్నారు.
అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం రాకపోవడంతో దాదాపు ఏడాదిగా ఈ నియామకం పెండింగ్‌లో పడింది. అయితే ఎట్టకేలకు గత రెండువారాల నుంచి ఆర్ ఎస్ ఎస్ ఆమోదంతో రాష్ట్రాల అధ్యక్షుల నియామాకాలు జరిగాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాలకు నూతనంగా బిజెపి అధ్యక్షుల నియామకం. ఈ నియామాకాలన్నింటిలో స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ముద్ర కనిపించింది. ప్రత్యేకించి రెండు తెలుగురాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల నియామకంలో ఆర్ఎస్ఎస్ తిరుగులేని తన ఆధిపత్యాన్ని నిరూపించింది.
ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ తర్వాత బిజెపిలోకి ప్రవేశించిన మాజీ ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, పివిఎన్.మాధవ్‌కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ అధ్యక్ష పదవికోసం హేమాహేమీలు పోటీపడినా, రేసులో లేని రాంచందర్‌రావుకే నాయకత్వ పగ్గాలు అప్పగించారు. పార్టీలో విపరీతమైన గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎవరికి పదవి అప్పగించినా, మరొకరు వారిని దెబ్బకొట్టే పరిస్థితి నెలకొనడంతో అందరినీ సమన్వయం చేసేందుకు సంస్థాగత నాయకుడిని సెలెక్ట్ చేసుకుంది.
ఏ గ్రూపులలో లేకపోవడం, వివాదాలకు దూరంగా ఉండడం, సంఘ్ పరివార్ ఆశీస్సులు ఉండడం రాంచందర్‌రావుకు కలిసొచ్చింది. అలాగే పార్టీ వ్యవహారాలు తమ చేతిలోనే ఉండాలనే ఉద్దేశంతో సీనియర్‌లు కూడా రాంచందర్‌రావుకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీ, రాజకీయంగా, ఆర్థికంగా బలమైన రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఎంపీలు అధ్యక్షపదవిని ఆశించినా, వారిని కాదని బ్రాహ్మణ వర్గాన్నే అధ్యక్ష పదవి వరించింది. ప్రతిపక్షంలో ఉండే ఏ పార్టీకైనా దూకుడుగా ఉండే నాయకుడు అవసరమనేది అభిప్రాయముంది. కానీ ఈసారి దూకుడు కంటే , గ్రూపిజం లేని వ్యక్తికే పగ్గాలు అప్పగించడం ద్వారా సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసేవారికే పెద్దపీట వేసింది. అన్ని గ్రూపుల మధ్య బ్యాలెన్స్ కోసమే ఈ నియామకం చేసినట్లుగా కనిపిస్తోంది.
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్‌కు బిజెపి సారథ్య బాధ్యతలు అప్పగించడంలో ఆర్ ఎస్ ఎస్ చక్రం తిప్పింది. మొన్నటిదాకా అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి మరోసారి తనకు అధ్యక్ష పదవి పొడగించాలని కోరారు. అయితే అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పార్టీ నిర్మాణం, పార్టీ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేదని అధిష్టానానికి నివేదికలందాయి. దాంతో ఆమెను కొనసాగించేందుకు అధిష్టానం అంగీకరించలేదు. ఆమె స్థానంలో ఆర్ఎస్ఎస్‌కు చెందిన మాధవ్‌ను నియమించడం ద్వారా సంస్థాగత నిర్మాణంపై వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఏపీలో అధ్యక్ష పదవికోసం పెద్దగా పోటీ లేనప్పటికీ వలస నేతలకు కాకుండా ఒరిజినల్ నేతలకే కీలక బాధ్యతలు ఇవ్వాలన్న ఆర్ఎస్ఎస్ అభిప్రాయం మేరకే మాధవ్ నియామకం జరిగింది. వలసనేతలకు ఎన్నికలలో టికెట్ ఇచ్చి రంగంలోకి దింపాలే తప్ప, పార్టీ కోర్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయడం వల్ల పెద్దగా లాభం లేదన్నది ఆర్ ఎస్ ఎస్ అభిప్రాయంగా ఉంది.
గత పదేళ్ల నుంచి బిజెపిలో నియామకాలన్నీ దాదాపుగా నరేంద్రమోడీ, అమిత్‌షా ద్వయమే ఫైనల్ చేసేది. అన్ని నియామాకాల్లోనూ వారి మాటే నెగ్గేది. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడంలో మోడీ-షా ద్వయం కీలకపాత్ర పోషించింది. దాంతో వారూ కోరుకున్నట్లుగానే ఆర్ ఎస్ ఎస్ సైతం బిజెపి నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అయితే ఒక్కసారిగా 2024లో పరిస్థితి మారిపోయింది. అబ్‌కీ బార్ చార్ సౌ పార్ ...ఈసారి 400 సీట్లు అనే గట్టి ప్రచారం చేసినా అది వర్కవుట్ కాలేదు.
2019లో వచ్చిన 304 సీట్ల నుంచి 2024కల్లా 240 సీట్లకు పడిపోవడంతో మోదీ-షా ద్వయం ప్రభ సన్నగిల్లడం మొదలైంది. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, పార్టీలో మాత్రం మోడీ-షా నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ఆమోదం తప్పనిసరిగా మారింది. దాని వల్లే బిజెపి అధ్యక్షుడు జెపి.నడ్డా పదవీకాలం ముగిసినా కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. జాతీయ అధ్యక్షుడి నియామకానికి దేశంలోని సగం రాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల నియామకం జరగాలనే నిబంధన ఉంది. దీనివల్లే నియామకం చేయడం లేదని బిజెపి అగ్రనేతలు బయటికి చెప్పుకున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం కొత్త బిజెపి అధ్యక్షుడి నియామకంపై మోడీ-షా, ఆర్ఎస్ ఎస్ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధానకారణం. తమ ఆమోదం లేకుండా నియమిస్తే, రానున్న ఎన్నికల్లలో సహకారం ఉండదనిసంకేతాలిచ్చింది.
ఇప్పటికే లోక్‌సబ ఎన్నికల్లో మెజారిటీ రాక, మిత్రపక్షాల బలంపై ఆధారపడిన మోడీ ప్రభుత్వం ఆర్ ఎస్ ఎస్ సహకారం కోల్పోతే పరిస్థితి మరింత జఠిలమవుతుంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొలిసారిగా నాగ్‌పూర్‌లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి తన విధేయతను చాటారు. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అన్ని నియామాకాలు ఆర్ ఎస్ ఎస్ ఆమోదంతో కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర బిజెపి చీఫ్‌గా రవీంద్ర చవాన్, ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్‌గా మహేంద్రభట్, హిమాచల్‌ప్రదేశ్ అధ్యక్షుడిగా రాజీవ్ బిందల్, మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా హేమంత్ ఖండేల్వాల్, పుదుచ్చేరికి రామలింగం, మిజోరాంకు కె.బెచువా, అండమాన్ నికోబార్‌కు అనిల్ తివారిని అధ్యక్షులుగా నియమించింది. వీరంతా ఆర్ఎస్ఎస్‌కు అత్యంత సన్నిహితులే. ఈ నియామకాల ద్వారా ఆర్ ఎస్ ఎస్ తిరిగి బిజెపి పై పట్టు బిగించినట్లయింది.
సగం రాష్ట్రాలకు కొత్తగా అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో బిజెపి రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడి నియామకానికి లైన్ క్లియరైంది. అయితే అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేదానిపై రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహన్, ధర్మేంద్ర ప్రదాన్, మనోహర్‌లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరంతా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నుంచే బిజెపిలోకి రాజకీయ ప్రవేశం చేసి వివిధ హోదాలలో కొనసాగుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొలిసారిగా అధ్యక్ష పదవి మహిళకు అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, శోభా కరద్లాంజె, మహిళామోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన ఎంపికలు చేసే మోదీ-షా ద్వయం ఈసారి ఆర్ఎస్ఎస్‌తో సమన్వయంతో వెళ్లాల్సి ఉంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది. దాదాపు ఏడాదికి పైగా జాతీయ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతోంది. బిజెపి అగ్రనాయకత్వం- ఆర్ ఎస్ ఎస్ మధ్య ఏకాభిప్రాయం లేని కారణంగానే ఆలస్యమయ్యింది. అయితే ఢిల్లీలో జరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్‌ల సమావేశం తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈసారి సంఘ్ సంపూర్ణ ఆశీస్సులున్న వ్యక్తికే పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అందబోతున్నాయి
-వెంకటేష్ నాగిళ్ల, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ ఢిల్లీ