చైనా కుట్ర : రంగు మారిన నది

Arunachal river turns black - Sakshi

గువాహటి : అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి జీవనరేఖగా పేరొందిన సియాంగ్‌ నదీ జలాలు కలుషితమౌతున్నాయి. చైనా అంతర్భాగమైన టిబెట్ పీఠభూమిలో సియాంగ్ను యార్లుంగ్‌ త్సాంగ్పో అంటారు. సియాంగ్‌ నది నుంచి నీటిని చైనా షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌కు అక్కడి నుంచి తక్లామకాన్ ఎడారికి తరలించడానికి వేయి కిలో మీటర్ల సొరంగం నిర్మిస్తోంది. సొరంగ నిర్మాణం కోసం రాళ్లు పగలగొట్టడంతోపాటు సిమెంటు వాడకం వల్ల సియాంగ్ జలాలు కలుషితమై రంగు మారిపోతున్నాయని నెలన్నర క్రితమే వార్తలొచ్చాయి. చైనా మాత్రం ఇలాంటి ప్రాజెక్టు ఏదీ లేదని, కొండలు పిండిచేసి సొరంగం నిర్మించడం లేదని తెలిపింది. ‘‘నదిలో మురికి నీరు ప్రవహించడానికి కారణాలు కనిపించడం లేదు. 

ఈ సొరంగ నిర్మాణానికి రిహార్సల్గా యునాన్‌ ప్రావిన్స్‌లో 600 కిలోమీటర్ల టనెల్ కట్టే పని ఇప్పటికే మొదలుబెట్టారు. అరుణాచల్ ఉత్తర ప్రాంతానికి ప్రాణప్రదమైన సియాంగ్లో మళ్లీ నీరు సహజ రంగులో ప్రవహించేలా చర్యలు తీసుకోవాలి’’ అని కోరుతూ అరుణాచల్‌ తూర్పు లోకసభ సభ్యుడు నినాంగ్ ఇరింగ్(కాంగ్రెస్) ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని ఎగువ సియాంగ్ జిల్లాలో సియాంగ్ నదిపై బహుళార్ధసాధక ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనను నీతి ఆయోగ్ గతంలో ప్రతిపాదించింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సమీప గ్రామాలు నీటమునుతాయంటూ స్థానికులు వ్యతిరేకించారు. ఫలితంగా సియాంగ్ లోయ ప్రాజెక్టు ప్రతిపాదన విరమించుకున్నారు.

దోషి చైనాయే: డెప్యూటీ కమిషనర్
రెండు నెలలుగా సియాంగ్‌ నది నీరు బాగా కలుషితమైందని, సాధారణస్థాయికి అనేక వందల రెట్లు కాలుష్యాలు ఉన్నాయని కేంద్ర జలసంఘం పరీక్షలో తేలిందని తూర్పు సియాంగ్ జిల్లా డెప్యూటీ కమిషనర్‌ తామ్యో తాతక్‌ చెప్పారు. ‘‘ఈ వానాకాలంలో నదిలో నల్లనీరు ప్రవహించింది.  బురదతో నీటి రంగు మారిందనుకున్నాం. నవంబర్-ఫిబ్రవరి కాలంలో నీరు స్వచ్ఛంగా ఉంటాయి. నిండా నీళ్లున్నా నదీగర్భం కనిపించేది. 

సియాంగ్లో మురికి నీరును మా తాత సైతం చూడలేదు’’ అని ఆయన వివరించారు. ఎగువ ప్రాంతంలో అంటే టిబెట్లో లోతైన బోరింగ్‌ పని జరుగుతున్న కారణంగానే నీటి రంగు మారిందనీ, అందుకే చైనాను అనుమానించాల్సివస్తోందని ఆయన అన్నారు.  టిబెట్ నుంచి 1600 కిలోమీటర్లు దిగువకు ఈ నది ప్రవహిస్తుంది. అరుణాచల్ప్రదేశ్లొ దీన్ని దిబాంగ్ అని కూడా పిలుస్తారు. 

రాష్ట్రంలో 250 కిలోమీటర్లు ప్రవహించాక లోహిత్ అనే నదితో కలిసి పెద్ద నదిగా మారుతుంది. అస్సాంలో బ్రహ్మపుత్రగా అవతరించి బంగ్లాదేశ్ మీదుగా సముద్రంలో కలుస్తుంది. అరుణాచల్లో ప్రధానంగా ఎగువ భాగంలో ప్రవహిస్తున్న కారణంగా ఈ నది పేరుతో(తూర్పు, పశ్చిమ, ఎగువ) మూడు జిల్లాలున్నాయి. ఇంత కీలకమైన ప్రధాన నదిలో కలుషిత నీరు ప్రవహించడం వల్ల ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. సియాంగ్‌ బురద ప్రవాహానికి తాను కారణం కాదని చైనా వాదిస్తున్నా ఈ విషయం తేల్చడానికి ఓ అంతార్జాతీయ బృందాన్ని రప్పించాలని ఎంపీ ఇరింగ్ డిమాండ్‌ చేశారు. భారీ స్థాయిలో సిమెంటు నిర్మాణ పని కారణంగానే నదీజలాలు ఇలా మారిపోయాయని పలువురు నమ్ముతున్నారు.

                                                                                                 (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top