ప్రకృతి ప్రేమికుల సామ్రాజ్యం | andaman and nikobar islands details | Sakshi
Sakshi News home page

ప్రకృతి ప్రేమికుల సామ్రాజ్యం

Aug 21 2015 8:57 AM | Updated on Jun 1 2018 9:35 PM

ప్రకృతి ప్రేమికుల సామ్రాజ్యం - Sakshi

ప్రకృతి ప్రేమికుల సామ్రాజ్యం

అందమైన సముద్రతీరాలు, పగడపు దీవులు, ఆకుపచ్చని అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణం, వింతైన జలచరాలతో.. ప్రకృతి తన సోయగాలను ఆరబోసినట్లు ఉండే ప్రదేశం అండమాన్ దీవులు.

సాక్షి: అందమైన సముద్రతీరాలు, పగడపు దీవులు, ఆకుపచ్చని అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణం, వింతైన జలచరాలతో.. ప్రకృతి తన సోయగాలను ఆరబోసినట్లు ఉండే ప్రదేశం అండమాన్ దీవులు. బిజీ బిజీ నగర జీవితంతో అలసిపోయి.. ప్రశాంత వాతావరణంలో కొద్ది రోజులు ఆనందంగా గడపాలనుకునే వారికి చక్కని ప్రదేశం అండమాన్ - నికోబార్ దీవులు. వందల సంఖ్యలో పక్షి జాతులు, సుమారు రెండు వేలకు పైగా జాతుల మొక్కలతో అండమాన్ అలరారుతోంది. అలాంటి పగడపు దీవుల అందాలపై స్పెషల్ ఫోకస్...
     
పగడపు దీవులు
అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో భాతర భూభాగానికి తూర్పదిక్కులో 800 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 8,249 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇవి మొత్తం 572 దీవులు. వీటిలో చాలా వరకు ప్రపంచపటంలో కనపడవు. వీటిల్లో 36 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. అండమాన్ దీవుల్లోకి మాత్రమే పర్యాటకులను అనుమతిస్తారు. నికోబార్ దీవుల్లో సందర్శకులకు అనుమతి నిషేధం.

చరిత్ర
పదిహేడవ శతాబ్దంలో మరాఠీయులు ఈ దీవులను ఆక్రమించారు. తరువాత బ్రిటిష్ ఇండియాలో భాగమయ్యాయి. రెండవ ప్రపంచయుద్ధకాలంలో నేతాజీ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ సహాయంతో ఈ దీవులను వశపరుచుకుంది. నేతాజీ మరణంతో తిరిగి బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్లాయి. 1947లో స్వతంత్య్ర భారతదేశంలో భాగమయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం హయంలో అనేక మంది భారతస్వాతంత్ర సమరయోధులను పోర్ట్‌బ్లెయిర్‌లో ఉన్న సెట్యులార్ జైలులో బంధించేవారు. ఈ జైలును కాలాపానీ అని కూడా పిలుస్తారు.

ఆకట్టుకుంటున్న సెల్యూలార్ జైలు
ఒకప్పుడు బ్రిటిష్ వారి రాక్షసత్వానికి నిదర్శనంగా, ఖైదీల పాలిట మృత్యువాకిలిగా ఉండే అండమాన్ జైలు నేడు జాతీయ స్మారక చిహ్నంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. రోజూ సుమారు 1000 మంది ఈ జైలును సందర్శిస్తుంటారు. ఇక్కడ బ్రిటిష్ వారు మొదట స్థావరం ఏర్పరుచుకున్న రాస్‌ఐలాండ్, అక్కడి మ్యూజియం చూడదగ్గవి.

ఆదాయవనరులు: ఇక్కడ వరి, సుపారి, కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. దాదాపు దీవులన్ని దట్టమైన అడవులతో దీవులతో నిండి ఉండటంతో కలప కూడా ప్రధాన ఆదాయవనరుగా ఉంది. చేపల వేట ఎంతో మందికి ఉపాధి మార్గంగా మారింది.

ఎలా వెళ్లాలి?
అండమాన్-నికోబార్ దీవులకు వెళ్లాలంటే ముందుగా రాజధాని పోర్ట్‌బ్లెయిర్ చేరుకోవాలి. కోల్‌కతా, చెన్నైల నుంచి రోజూ పోర్ట్‌బ్లెయిర్‌కు విమాన సర్వీసులు ఉన్నాయి. చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు విమానంలో రెండు గంటల ప్రయాణం. విశాఖపట్నం, చెన్నై, కోల్‌కతాల నుంచి ఓడలో రెండున్నర నుంచి మూడురోజుల ప్రయాణంతో పోర్ట్‌బ్లెయిర్ చేరుకోవచ్చు.
 
అండమాన్ అందాలు
అండమాన్‌ను సందర్శించే వాళ్లకు అక్కడి టూరిజం డిపార్ట్‌మెంట్ వాటర్ డైవింగ్, స్పీడ్ బోటింగ్, రోయింగ్, ఆక్వా సైక్లింగ్, సెయిలింగ్...ఇలా అనేక జలక్రీడలను నిర్వహిస్తోంది. ఆ దీవులకు వెళ్లిన వారు తప్పకుండా చూడాల్సిన బీచ్‌లు.. రాధానగర్ బీచ్, హర్మిరందర్ బే బీచ్, కర్మటాంగ్ బీచ్. ఇక్కడి ఫిషరీస్ మ్యూజియం రకరకాల చేపలను మన కళ్లముందు ఉంచుతుంది. ప్రపంచంలోని విశేషమైన సీతాకోక చిలుకలను ఇక్కడి హారెట్ నేషనల్ పార్క్‌లో చూడవచ్చు. ట్రైబల్ రిజర్వ్స్,  వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, మహాత్మాగాంధీ జాతీయ పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అండమాన్ దీవుల్లోని హావ్ లాక్ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి బీచ్‌లు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి జలక్రీడలను ఇక్కడ ఆనందిచవచ్చు. ఇక్కడి రూట్ ల్యాండ్ ఐలాండ్ ప్రకృతి సోయగాలకు నిలయం. సముద్ర తీర అడవులు, పగడపు దీవులు వంటి సహజ సౌందర్యాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అండమాన్‌లోని నీల్ ద్వీపం పొడవైన సముద్ర బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించే స్నార్కెలింగ్, సి వాకింగ్, వంటి జలక్రీడలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటాయి. బారాతంగ్ ద్వీపంలో బారాతంగ్ అగ్నిపర్వతం ఉంది. టూరిస్ట్ గైడ్‌లతో ఈ దీవికి వెళ్లటం మంచిది. ఇక్కడ అనేక సున్నపు రాతి గుహలు, మాన్ గ్రోవ్ ప్రదేశాలు ఉంటాయి.

జార్వా తెగకు చెందిన ఆదిమజాతి ప్రజలు ఇక్కడ నివసిస్తారు. వీరితో వ్యవహరించటం చాలా కష్టం. ఇతర ప్రజలు తమ ప్రాంతాల్లోకి రావటాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అండమాన్ ప్రభుత్వం ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి నెలల్లో 15 రోజులు పాటు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఎకో ఫ్రెండ్లీ టూరిజాన్ని ప్రోత్సహిచేందుకుగానూ, సంగీత, నృత్య, వాయిద్య రంగాల్లోని ప్రముఖ కళాకారులతో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా వాటర్‌స్పోర్ట్స్, పరుగుపందేలు, మ్యాజిక్ షోలు, పప్పెట్ షోలు, స్కూబా డైవింగ్ లాంటి ఎన్నో క్రీడలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement