మోదీకి ప్రముఖుల లేఖ.. అనంత శ్రీరామ్‌ కౌంటర్‌

Ananta Sriram Counter Over 49 Celebrities Write Letter To PM - Sakshi

హైదరాబాద్‌: దేశంలో గత ఐదేళ్లుగా మూక హత్యలు పెరిగాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 49 మంది ప్రముఖులు లేఖ రాయడం తీవ్ర దుమారం రేపుతోంది. ‘జై శ్రీరామ్‌’ రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయిందని, ఆయన పేరుతో హత్యలు పెరుగుతున్నాయని, ప్రధానిగా ఈ దుశ్చర్యలను నిలువరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే, వారిపై 'యాంటీ నేషనల్', 'అర్బన్ నక్సల్' అనే ముద్ర వేస్తున్నారని వారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రముఖులు లేఖలో పేర్కొన్న పలు అంశాలపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూక హత్యలు ఒక మతానికే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని హిందుత్వ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా పాటల రచయిత అనంత శ్రీరామ్‌ కూడా 49 మంది ప్రముఖులను తప్పుబట్టారు. దీనికి సంబంధించి తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజిలో ‘నకిలీ మేథావులు మళ్లీ సకిలించారు’పేరిట ఓ పోస్ట్‌ పెట్టారు. (చదవండి: మతవిద్వేష దాడుల్ని ఆపండి!)

‘జై శ్రీరాం’ పదం నిషేధించమంటారా?
‘నకిలీ మేధావులు మళ్ళీ సకిలించారు. కుహనా లౌకికవాదులంతా కుమ్మక్కై ప్రధాన మంత్రికి ఉత్తరం రాశారట. అందులో ఏముందయ్యా అంటే "జై శ్రీరాం" అన్న పదం వల్ల ఎన్నో దారుణ మారణ కాండలు జరిగిపోతున్నాయంట. అందువల్ల ఆ పదం వల్ల జరిగే దుష్పరిణామాలు ఆపాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదేనట. అంటే ఆ మహాశయులు ఇప్పుడేమంటారు "జై" అన్న పదాన్ని , "శ్రీరాం" అన్న పదాన్ని నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా? ఏమో అన్నా అంటారు. మేథావులుకదా. వాళ్ళు అనేవారలు, మేము వినే వారలము. ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు చిక్కంతా వచ్చి ఇప్పుడు క్రిష్ణా రామా అనుకుంటూ శేష జీవితం ఆనందంగా గడుపుతున్న తల్లిదండ్రులని వచ్చి చుట్టుకుంటుంది. ఎందుకంటే నాపేరు "అనంత శ్రీరాం" ఈ మేధావుల మేధస్సుని అంచనా వెయ్యలేక మా తల్లిదండ్రుల్లానే ఎంతోమంది తమ పిల్లల పేర్లలో రామశబ్ధాన్ని ప్రయోగించారు. (సీతారాం ఏచూరి గారి నాన్నగారితో సహా ). ఇప్పుడు వాళ్ళంతా మా జనన ధృవీకరణ పత్రాలు మొదలుకుని ఆధార్ల వరకూ మాపేర్లు మార్చే బృహత్తర బాధ్యతని నెత్తినేసుకోవడం ఎలారా నాయనా అని నెత్తీ , నోరు బాదుకోవలసిన పరిస్థితి. అది మరి మేధావి దెబ్బంటే’అంటూ అనంత శ్రీరామ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top