కేంద్రంలో కీలక నియామకాలు

Amitabh Kant Gets Two Year Extension As NITI Aayog CEO - Sakshi

నీతి ఆయోగ్‌ సీఈవో పదవీకాలం పెంపు

ఇంటిలిజెన్స్‌, రా లకు కొత్త అధిపతులు

సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నీతి ఆయోగ్‌ సీఈవోగా ఆయన 2016 ఏప్రిల్‌ 1న నియమితులైన విషయం తెలిసిందే. కాంత్‌ పదవీ కాలంలో జూన్‌ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పెంపుతో 2021 జూన్‌ 30 వరకు  ఆయన పదవిలో కొనసాగనున్నారు. 

ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లకు కేంద్ర ప్రభుత్వం కొత్త అధిపతులను నియమించింది. అస్సాం-మేఘాలయ కేడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ఆయన కశ్మీరు సంబంధిత అంశాల్లో నిపుణుడు.

రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) చీఫ్‌గా కశ్మీర్‌కు చెందిన సామంత్‌ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో భారత బలగాలు చేపట్టిన మెరుపు దాడులు, బాలకోట్‌ వైమానిక దాడులకు గోయల్‌ వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కొత్తగా నియమితులైన వీరిద్దరూ కూడా 1984 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు కావడం విశేషం. ఇక త్వరలో పదవీ విరమణ చేయబోతున్న భారత సైన్యం అధిపతి జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఎవరిని నియమిస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top