‘దేశంలో ఏ మూలన ఉన్నా సరే వెళ్లగొడతాం’

Amit Shah Says Will Identify All Illegal Immigrants And Deport Them - Sakshi

న్యూఢిల్లీ : అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన ఉన్నా సరే అంతర్జాతీయ చట్టాలను అనుసరించి వారిని బయటకు పంపివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.  ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్(ఎన్నార్సీ)‌’ దేశంలోని ప్రతీ రాష్ట్రానికి వర్తింపజేస్తారా అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావేద్‌ అలీ ఖాన్‌ అడిగిన ప్రశ్నకు అమిత్‌ షా సమాధానమిచ్చారు. భారత పౌరులను గుర్తించే ఎన్నార్సీ విషయమై ప్రస్తుతం అసోంలో ఆందోళనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలస వచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్‌ ఆఫ్‌ సాయిల్‌’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికల హామీలో భాగంగా అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడతామంటూ బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి బుధవారం రాజ్యసభలో ఎస్పీ ఎంపీ సంధించిన ప్రశ్నకు అమిత్‌ షా బదులిస్తూ.. ‘చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజానికి అసోంలో ఎన్నార్సీ గురించి ఆందోళనలు జరిగిన సమయంలో ఆ సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం. దీనిని అనుసరించి అక్రమ వలసదారులను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అంతర్జాతీయ చట్టాలననుసరించి వారిని దేశం నుంచి వెళ్లగొడతాం. ఇది దేశంలోని ప్రతీ మూలలో, భారతదేశ మట్టిపై అక్రమంగా నివసిస్తున్న ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది’ అని స్పష్టం చేశారు.

ఇక జూలై 31లోగా ఎన్నార్సీ ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ మాట్లాడుతూ.. భారత పౌరుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసిన క్రమంలో ఇప్పటికే 25 లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్‌ కేంద్రానికి అందిందని.. అయితే ఇందులో ఉన్న బోగస్‌ అప్లికేషన్లు గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో చివరి తేదీని పొడగించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరతామన్నారు. నిజమైన భారతీయ పౌరుడికి అన్యాయం జరుగకూడదనేదే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా రోహింగ్యా ముస్లిం సంఖ్యకు సంబంధించి సమాధానమిస్తూ... దేశవ్యాప్తంగా వీరు వ్యాపించి ఉన్నారు, కాబట్టి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి డేటాను సేకరించేందుకు కాస్త సమయం పడుతుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top