మోదీ పిలుపునకు ‘అమెజాన్‌’ పలుకు

Amazon India To Replace All Single Use Plastic Packaging  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రీసైకిల్‌కు ఉపయోగపడని, ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ పదార్థానికి ఇక శాశ్వతంగా వీడ్కోలు చెప్పాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛందంగా పలు సంస్థలు స్పందిస్తున్నాయి. తాజాగా ఆ కోవలో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’ చేరింది. 2020 నాటికల్లా ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ వినియోగాన్ని భారత్‌లోని తమ యూనిట్‌ పూర్తిగా వదిలేస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. అమెజాన్‌ కంపెనీ తాను సరఫరా చేసే వస్తువులు లేదా పరికరాల ప్యాకేజీకి మూడు రకాల ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తోంది. 

అందులో ఒకటి ఏర్‌ పిల్లో, రెండోది బబుల్‌ లైన్డ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ కాగా, మూడోది స్టాండర్డ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌. ఇవేవీ కూడా రీసైక్లింగ్‌కు పనికి రావు. ఒకసారి ఉపయోగించి పడేయాల్సిందే. అలా అని భూమిలో అస్సలు నశించి పోవు. అందుకనే ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా ముందుగా రీసైక్లింగ్‌కు పనికిరాని ప్లాస్టిక్‌కు తక్షణం గుడ్‌బై చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్రం దినోత్సవం రోజున ఎర్రకోట పైనుంచి జాతిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ పిలుపునిచ్చారు. ఆ తర్వాత రేడియోలో వచ్చే ‘మన్‌ కీ బాత్‌’ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేది తాను జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి అయిన అక్టోబర్‌ రెండవ తేదీన ప్రకటిస్తానని కూడా తెలిపారు. 

రీసైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్‌ను వాడరాదంటూ అమెజాన్‌ లాంటి సంస్థలకు వ్యతిరేకంగా ‘చేంజ్‌ ఆర్గ్‌’ లాంటి సంస్థలు వేలాది మంది ప్రజల సంతకాలతో సోషల్‌ మీడియా ద్వారా ఒత్తిడి తీసుకరావడంతో అమెజాన్‌ సంస్థ స్పందించాల్సి వచ్చింది. తాము భవిష్యత్తులో రీసైక్లింగ్‌కు ఉపయోగపడే ప్లాస్టిక్‌ను ఉపయోగించినప్పుడు వాటిని ఎలా రీసైక్లింగ్‌ చేయవచ్చో, ఎక్కడ చేయవచ్చో పూర్తి వివరాలను వినియోగదారులకు ఎప్పటికప్పుడు అందజేస్తామని కూడా చెప్పింది. ఈ విషయంలో అమెజాన్‌ ప్రత్యర్థి సంస్థ గత వారమే స్పందించింది. తాము తక్షణమే రీసైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్‌ను 25 శాతం తగ్గించామని, 2021 సంవత్సరం వరకు సంపూర్ణంగా నిషేధిస్తానమి ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్పందించిన అమెజాన్‌ 2020 నాటికే నూటికి నూరు ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇచ్చింది. అక్టోబర్‌ 2వ తేదీన ఈ ప్లాస్టిక్‌ విషయంలో తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఈ సంస్థల దశలవారి నిషేధానికి అంగీకరిస్తారా లేదా సంపూర్ణ నిషేధాన్ని ఎప్పటి నుంచి విధిస్తారో వేచి చూడాల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top