
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే.. మరో వైపు సీతామాతలను దహనం చేస్తున్నారని అధిర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా లోక్‌సభ గందరగోళ వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో గురువారం అత్యాచార బాధితురాలిని దహనం చేసిన ఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
హైదరాబాద్, ఉన్నావ్‌లో రేప్‌లు జరుగుతున్నాయని, అక్కడి ప్రజల్లో అభద్రతా భావం నెలకొని ఉందని ఆయన అన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. చట్టం లేని ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ మారిపోయిందన్నారు. ఉత్తరప్రదేశ్‌ను 'ఉత్తమప్రదేశ్'గా మార్చాలని మాటలు వినిపిస్తున్న తరుణంలో అది అధర్మప్రదేశ్‌గా మారిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన ఘటనలు బాధాకరమని.. కానీ ఆ విషయాలను కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మాత్రం సరికాదన్నారు. దీంతో కాంగ్రెస పార్టీ రెండు ఘటనలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసింది.