తమిళనాట జగనన్నకు జై

Actor Vijay fans posters with AP CM YS Jagan Mohan Reddy photo - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో నటుడు విజయ్‌ అభిమానుల పోస్టర్లు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజా సంక్షేమ పాలన దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలోని తమిళ ప్రజలు వైఎస్‌ జగన్‌ పరిపాలనను తొలి రోజు నుంచీ గమనిస్తుండగా.. తమిళ మాధ్యమాలు నేటికీ కథనాలు ప్రచురిస్తూ కొనియాడుతున్నాయి. ఇదే సందర్భంలో సినీ నటుడు విజయ్‌ అభిమానులు మరో అడుగు ముందుకేసి ఏకంగా జగన్‌ ఫొటోతో వాల్‌పోస్టర్లనే అతికిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో రజనీకాంత్‌ తరువాత అంతటి ఫాలోయింగ్‌ కలిగిన నటుడు విజయ్‌.

విజయ్‌ రాజకీయాల్లోకి రావాలని ఆయన తండ్రి, సీనియర్‌ దర్శకులు ఎస్‌ఏ చంద్రశేఖర్‌తోపాటూ అభిమానులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలను దుయ్యబడుతూ 2018లో ఆయన నటించిన ‘సర్కార్‌’ అనే చిత్రం రాజకీయ వర్గాల్లో కలకలానికి దారి తీసింది. తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలా ఉండగా, ఈనెల 22వ తేదీన నటుడు విజయ్‌ జన్మ దినోత్సవం సందర్భంగా కుంభకోణంలోని ఆయన అభిమానులు వాల్‌పోస్టర్లు అతికించి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా విజయ్‌ ఘనవిజయం సాధించి తమిళనాడును పాలించేందుకు రానున్నారు’ అనే నినాదం, జగన్, విజయ్‌ చిత్రాలతో కూడిన వాల్‌పోస్టర్లు ముద్రించి అతికిస్తున్నారు. రాజకీయవర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. ‘కుంభకోణం విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ తరఫున అతికించిన ఈ పోస్టర్లలో రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న ‘సర్కార్‌’ అనే నినాదాన్ని సైతం ఆ పోస్టర్లలో పొందుపరిచారు. మధురైలోనూ ఇలాంటి పోస్టర్లు వెలిశాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top