అభినందన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్‌ | Sakshi
Sakshi News home page

అభినందన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్‌

Published Fri, Mar 1 2019 4:06 PM

Abhinandan Varthaman reaches Wagah Border - Sakshi

ఇస్లామాబాద్‌ / న్యూఢిల్లీ : వాఘా సరిహద్దుకు భారత వాయుసేన(ఐఏఎఫ్‌) పైలట్, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ అభినందన్‌ చేరుకున్నారు. రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మధ్యవర్తిగా అప్పగింత  ప్రక్రియను రెడ్‌క్రాస్‌ పూర్తిచేసింది. అయితే దౌత్యపరమైన టెక్నికాలిటీస్‌ పూర్తి చేయడంలో ఆలస్యం అవుతోంది. మరి కాసేపట్లో అభినందన్‌ను అప్పగించినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. జయహో అభినందన్‌ నినాదాలతో వాఘా సరిహద్దు మార్మోగిపోయింది. పాక్‌ చెర నుంచి విడుదలై అభినందన్‌ క్షేమంగా రావడంతో జై హింద్‌, భారత్‌ మాతాకీ జై నినాదాలతో వాఘా సరిహద్దులో ఆనందోత్సాహలు వెల్లివిరిశాయి.

భారత్‌ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి దాయాది దేశం పాకిస్తాన్‌ తలొగ్గిందిన విషయం తెలిసిందే. తాము అరెస్ట్‌ చేసిన వర్ధమాన్‌ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించింది. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదుల స్థావరంపై భారత్‌ మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాక్‌ యుద్ధ విమానాలు మరుసటిరోజు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా పాక్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని భారత్‌ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్‌ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్‌ అభినందన్‌ అనే పైలట్‌ను అరెస్ట్‌ చేశామని పాకిస్తాన్‌ ప్రకటించుకుంది. వర్ధమాన్‌ అరెస్టును ధ్రువీకరించిన భారత విదేశాంగ శాఖ.. జెనీవా నిబంధనల ప్రకారం అభినందన్‌ విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలనీ, ఆయన్ను సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్‌ చేసింది. దీనికితోడు వర్ధమాన్‌ విడుదల విషయంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూరోపియన్‌ యూనియన్‌ సహా పలుదేశాలు పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటు ఉభయసభలను సమావేశపర్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement