సెంచరీకి చేరువైనా చెదరని సంకల్పం

RAJ KUMAR VAISHYA

సాక్షి, పాట్నా : ఉద్యోగం కోసమో, జీవితంలో స్థిరపడేందుకే ఎలాగోలా చదివేస్తే ఓ పనైపోతుందని భావించే యువతకు ఈ తాత స్టోరీ కనువిప్పు కలిగిస్తుంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయాలన్న ఆయన స్వప్నం ఫలించేందుకు వయసునూ ఖాతరు చేయని ఆయన సంకల్పం అందరిలో స్ఫూర్తిని రగిలిస్తోంది. 98 సంవత్సరాల రాజ్‌ కుమార్‌ వైశ్య 1938లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. మళ్లీ అదే సబ్జెక్ట్‌లో 79 ఏళ్ల తర్వాత నలంద ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన వైశ్య తాజాగా ఎంఏ (ఎకనమిక్స్‌)లో సెకండ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. 1940లో ఆయన ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాన్నివింటున్నానని, ఇది ఇప్పటికీ నినాదంగానే మిగిలిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తాను వార్తాపత్రికల్లో వ్యాసం రాస్తానని, మురికివాడల్లో పేదరికాన్నిప్రతిబింబించే ఫోటోలను తీసేందుకు తన కుమారుడిని కెమెరా ఇవ్వాలని కోరానని చెప్పారు.ఇక పీజీ పరీక్షల్లో తన విజయానికి తన కోడలు భారతి కారణమని రాజ్‌కుమార్‌ వైశ్య చెబుతున్నారు.

పాట్నా కాలేజీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేసిన భారతి పదవీవిరమణ చేశారు.తండ్రి ఎంఏ పట్టా పొందడంపై వైశ్య కుమారుడు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సంతోష్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేస్తూ ఇవి తమకు ఆనంద క్షణాలని వ్యాఖ్యానించారు. మరోవైపు తమ విశ్వవిద్యాలయ చరిత్రలో ఇది మరపురాని రోజని వర్సిటీ వీసీ ఎస్‌పీ సిన్హా వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top