ఉత్తరప్రదేశ్‌లో ఘోరం

8 Police Deceased Including DSP In Vikas Dubey Followers Shooting - Sakshi

హిస్టరీ షీటర్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నం

వికాస్‌ అనుచరుల కాల్పుల్లో డీఎస్పీ సహా 8 మంది మృత్యువాత

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్లు రెచ్చిపోయారు. వికాస్‌ దూబే అనే హిస్టరీ షీటర్‌ను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నేరస్తులను పోలీసులు హతమార్చారు. కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కరడుగట్టిన నేరగాడైన వికాస్‌ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. బిక్రూ గ్రామంలో అతడు మకాం వేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ విషయం గుర్తించిన వికాస్‌ దూబే ఆ గ్రామానికి దారితీసే రోడ్లపై తన అనుచరులతో అడ్డుకట్టలు వేయించాడు. పోలీసులు అతికష్టం మీద వికాస్‌ ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఇంటిపై నుంచి అతడి అనుచరులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, మరో పౌరుడు గాయపడ్డారు. మృతిచెందిన, గాయపడిన పోలీసుల వద్ద ఉన్న ఏకే–47, ఇన్సాస్‌ రైఫిల్, గ్లాక్‌ పిస్టల్, రెండు .9 ఎంఎం పిస్టళ్లను వికాస్‌ దూబే అనుచరులు ఎత్తుకెళ్లారు. ఉన్నతాధికారులు వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నివాడా గ్రామం వద్ద దుండగులు ఎదురుపడడంతో కాల్పులు జరిపారు. ఇందులో వికాస్‌ అనుచరులైన ప్రేమ్‌ ప్రకాశ్, అతుల్‌ దూబే అనే ఇద్దరు హతమైనట్లు అధికారులు ప్రకటించారు. బిక్రూలో పోలీసుల వద్ద అపహరించిన ఒక పిస్టల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వికాస్‌ దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది.

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం  
చనిపోయిన పోలీసులకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం కాన్పూర్‌లో నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.  మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. నేరగాళ్ల చేతిలో ఎనిమిది మంది పోలీసులు చనిపోవడం పట్ల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యూపీలో గూండారాజ్‌కు ఇది మరో నిదర్శనమని ఆరోపించారు.  యూపీలో నేరగాళ్లకు జంకూగొంకూ లేకుండా పోయిందని, విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top