లేటు వయసులో బడికి వెళ్తున్న ఎమ్మెల్యే

59 Year Old MLA Phool Singh Meena Goes Back To School - Sakshi

ఉదయ్‌పూర్‌/రాజస్తాన్‌ :  పెద్దయిన తర్వాత చదువు కొనసాగించడం అందరూ అసాధ్యమనుకుంటారు. రాజకీయ నాయకులైతే అది అసలు కుదరని పని అనుకుంటారు. కానీ చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు ఓ సీనియర్‌ ఎమ్మెల్యే. చదువుకోవాలనే దృఢ సంకల్పంతో మళ్లీ బడి బాట పట్టాడు. ఏడో తరగతితోనే ఆగిపోయిన తన చదువును గ్రాడ్యుయేషన్‌ వరకూ తీసుకొచ్చారు.

వివరాల్లోకి వెళితే..రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ రూరల్‌ ఎమ్మెల్యే , బీజేపీ నేత ఫూల్‌సింగ్‌ మీనా (59)కు నలుగురు కూతుళ్లు. చిన్న తనంలోనే తండ్రి చనిపోవడంతో మీనా పాఠశాల చదువును మధ్యలోనే ఆపేశారు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయం పనులను చేసుకుంటూ చదువును కొనసాగించలేకపోయారు. అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. కానీ చదువు మాత్రం పాఠశాల స్థాయికే పరిమితమైంది. ఎమ్మెల్యే అయ్యాక పదో తరగతి చదివారు.  ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

‘మా నాన్న చనిపోవడంతో చదువు మానేశాను. ఎమ్మెల్యే అయ్యాక ప్రధాన మంత్రి ‘బేటి బచావో బేటి పడావో’  ప్రచారంలో భాగంగా గిరిజన బాలికల్ని విద్యావంతులు చేయడం కోసం కృషి చేయాలకున్నాను. దీని కంటే ముందు నేను విద్యావంతున్ని కావాలనుకున్నాను. నా కూతుళ్లు కూడా ప్రోత్సాహకాన్ని అందించారు. దీంతో 2013లో ఓపెన్‌ టెన్త్‌లో చేరాను. కానీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పరీక్షకు హాజరు కాలేకపోయాను. 2016లో పదో తరగతి పాసయ్యాను. 2017లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాను. ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. విద్య అందరికి అవసరం. అందరూ చదువుకోవాలి’  అని ఎమ్మెల్యే ఫూల్‌ సింగ్‌ మీనా తెలిపారు. 

అంతే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘బేటి బచావో బేటి పడావో’ స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ బాలికలు చదువుకోవాలని ప్రచారం చేస్తున్నారు. సెంకడరీ విద్యలో 80శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఉచితంగా విమానయాన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా 2016లో ఇద్దరు విద్యార్థులు, 2017లో ఆరుగురు విద్యార్థులు విమానంలో ప్రయాణించారు. ఇక నుంచి జనరల్‌ విద్యార్థులు కూడా 80 శాతం మార్కులు సాధిస్తే ఉచిత విమానయాన సదుపాయం కల్పిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఏదేమైనా అటు పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సహిస్తూ.. ఇటు తను చదువుకుంటూ విద్యకు వయసు అడ్డురాదని నిరూపించారు ఎమ్మెల్యే ఫూల్‌సింగ్‌ మీనా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top