
లక్నో: యూపీలోని గోండా జిల్లాలో ఆ రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వాహనశ్రేణి ఢీకొని రోడ్డు పక్కన ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు శనివారం మరణించాడు. బాలుడిని కారుతో గుద్దిన తర్వాత కనీసం పిల్లాడికి ఏమైందో చూడటానికి కూడా ఆపకుండా వాహనశ్రేణి వెళ్లిపోయింది. బాధిత కుటుంబానికి సీఎం యోగి రూ.5 లక్షల పరిహారం ప్రకటించడంతోపాటు ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరారు. సంఘటన జరిగినప్పుడు తాను ఆ కార్లలో లేనని రాజ్‌భర్ చెబుతుండగా, అది అబద్ధమని స్థానికులు వాదిస్తున్నారు. మంత్రిపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ, బహుజన సమాజ్, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్‌భర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.