స్వదేశంవైపే భారత యువత చూపు

40% decline in Indians looking for work in US - Sakshi

బెంగళూరు : ఉద్యోగాల కోసం అమెరికా, బ్రిటన్‌ వెళ్లేందుకు భారత యువత ఆసక్తిని చూపడం లేదా? వెళ్లినా ఉపయోగం లేదనే భావనలో యువత ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికాలో  వలస చట్టాలను డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినతరం చేయడం, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడంతో ఆయా దేశాలకు వెళ్లేందుకు భారతీయ యువత కొద్దిగా జంకుతోంది. ప్రముఖ జాబ్‌ సైట్‌ ‘ఇండీడ్‌’ ప్రకటించిన గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఉద్యోగాల కోసం అమెరికా, బ్రిటన్‌ వెళ్లేవారి శాతం 38-నుంచి 42 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది అంటే 2016 సెప్టెంబర్‌ నుంచి 2017 అక్టోబర్‌ వరకూ ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఇదే 2015-16 మధ్యలో ఆయా దేశాలకు వెళ్లేందుకు యువత ఆసక్తిని ప్రదర్శించింది. ఇదిలావుంటే గతంతో పోలిస్తే విదేశీ ఉద్యోగాలపై భారతీయుల్లో ఆసక్తి 5 శాతం మేర తగ్గిందని ఇండీడ్‌ తెలిపింది.

అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వదేశంలోనే ఉద్యోగాలు చేసుకునేందుకు భారతీయులు ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగావకాశాలు వెతికే వారు 25 శాతం మేర పెరిగాయి. ఇదిలా ఉండగా.. ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారు 10 శాతం ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగింది. ఐరోపా దేశాల్లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం వల్ల ఆయా దేశాలపై భారతీయులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోతుండడంతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు భారతీయ యువత ఆసక్తిని చూపడం లేదు. గతంతో పోలిస్తే ఇది 21 శాతానికి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top